AP EXIT POLLS TDP YSRCP FEARS OF JANASENA PARTY IN GUNTUR DISTRICT BA
రాజధాని జిల్లాలో రసవత్తర పోరు.. పవన్ పంచ్ టీడీపీకా? వైసీపీకా?
జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్
2014లో గుంటూరు జిల్లాలో టీడీపీ 12 సీట్లు గెలుచుకుంది. వైసీపీకి ఐదు సీట్లు దక్కాయి. ఈసారి జనసేన పార్టీ ఎవరి కొంప ముంచుతుందో అని రెండు పార్టీలు ఆందోళనతో ఉన్నాయి.
గుంటూరు జిల్లా రాజకీయంగా ఎంతో పరిణతి చెందింది. జిల్లా నుంచి ఎందరో నాయకులు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించారు. అలాంటి గుంటూరు జిల్లాలో ఈసారి ఎవరు పట్టు నిలబెట్టుకుంటారో అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 17 సీట్లలో 12 టీడీపీ, ఐదు వైసీపీ గెలుచుకున్నాయి. రాష్ట్ర విభజన, రుణమాఫీ హామీ, చంద్రబాబు అనుభవం వంటి అనేక విషయాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. తెలుగుదేశానికి అధికారాన్ని కట్టబెట్టాయి. ఈసారి జిల్లాలో తెలుగుదేశం తన ఆధిక్యత ను నిల్లబెట్టుకుంటుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది. రాజధాని జిల్లా కావటంతో ఈసారి తెలుగుదేశం, వైసీపీలు తమ ఆధిక్యం చాటుకోవటం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. వారు గెలవకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ, తెలుగుదేశం ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది.
చంద్రబాబు, వైఎస్ జగన్
గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల శివప్రసాదరావు, అంబటి రాంబాబుపై 924 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా వీరిద్దరి పోటీ చేశారు. ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోలింగ్ సాగింది. అయితే, జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర్ రెడ్డి పొటీలో ఉన్నారు. యర్రం ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతిస్తారు అనేదానిపై ప్రజలు లెక్కలు వేస్తున్నారు. అలాగే గతంలో ఎన్నడూ తెలుగుదేశం గెలవని రాజధాని నియోజకవర్గం మంగళగిరిలో స్వల్ప మెజారిటీతో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫై నారా లోకేష్ పోటీకి దిగటంతో ఇక్కడ కూడా గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డారు. తెనాలిలో తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా, వైసీపీ నుంచి అన్నాబత్తుని శివ కుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తుండటంతో త్రిముఖ పోటీ ఏర్పడింది.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( ఫైల్ ఫోటో)
వినుకొండ, చిలకలూరిపేట, నరసరావుపేట, పెదకూరపాడు, మంగళగిరి, గురజాలలో తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీగా తలపడగా కొన్ని నియోజకవర్గాలలో ఆ రెండు పార్టీలకు జనసేన నుంచి ముప్పు ఉంది. గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో జనసేన నుంచి బలమైన అభ్యర్థులు ఉంది.
అయితే, 2014లో వచ్చినట్టుగా టీడీపీకి 12 సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైసీపీ మాత్రం తమకు 10 సీట్లు దక్కుతాయని లెక్కలు వేస్తోంది. వారిలో ఎవరి అంచనాలు కరెక్ట్ అవుతాయో మే 23న తేలనుంది.
(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్18)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.