సీఎం జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు, వైసిపి ప్రభుత్వ విధానం ప్రజలు ఇబ్బందిపడేలా ఉండకూడదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు.

  • Share this:
    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తప్పుబట్టారు. అసలు రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో మీడియాలో మాట్లాడిన నాదెండ్ల భాస్కరరావు... సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు. అనుభవ రాహిత్యంతో సీఎం జగన్‌ నిర్ణయాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి 3 వేల మంది ప్రజలకు 30 మంది ఉద్యోగులు అవసరం లేదని మాజీ సీఎం నాదెండ్ల తెలిపారు. ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఇలాంటి నిర్ణయాల కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

    జగన్ తీసుకున్న నిర్ణయాలు, వైసిపి ప్రభుత్వ విధానం ప్రజలు ఇబ్బందిపడేలా ఉండకూడదని నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు చీదరించుకునేలా ఉండకూడదని నాదెండ్ల భాస్కరరావు పరోక్షంగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కొద్ది నెలల క్రితం నాదెండ్ల భాస్కరరావు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ తనయుడు ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనలో కొనసాగుతున్నారు.
    First published: