ఎల్లుండి విజయవాడలో దీక్ష.. చంద్రబాబు ప్రకటన..

ఇసుక కృత్రిమ కొరత - వైసీపీ ప్రభుత్వ హత్యలకు నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష చేపడతానని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

news18-telugu
Updated: November 12, 2019, 7:22 PM IST
ఎల్లుండి విజయవాడలో దీక్ష.. చంద్రబాబు ప్రకటన..
చంద్రబాబు, జగన్
  • Share this:
ఇసుక కృత్రిమ కొరత - వైసీపీ ప్రభుత్వ హత్యలకు నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష చేపడతానని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఇసుక కొరత సృష్టించి.. 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులపై వైసీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. కార్మికుల ఆత్మహత్యలు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మున్నెన్నడూ జరగలేదని, ఎమ్మార్వో, ఎండీవో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్తున్నారని అన్నారు. ఈ ధోరణులకు వైసీపీ నేతల అరాచకాలే కారణమని విమర్శించారు. పెద్దడోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు బాధాకరమని, ఉద్యోగాలు తొలగిస్తామన్న వేధింపులే దీనికి కారణమని ఆఱోపించారు. వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచి, మరో చేత్తో వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని అన్నారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్నవాళ్లను తొలగించడం అన్యాయమని, 6,400 మంది పశుసఖిలను రోడ్డుమీదకు నెట్టారని తెలిపారు. 27 వేల సంఘమిత్రల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. ‘ఇసుక కొరత అనేది గతంలో ఏపీ చరిత్రలోనే లేదు. ఆహార కొరత, విద్యుత్తు కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ, ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నాం. లేని ఇసుక కొరత సమస్యను వైసీపీ నేతలే సృష్టించారు. తమ అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారు.’ అని ఆరోపించారు.

ఐదు రెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారని, కృత్రిమ కొరతతో బ్లాక్‌లో విక్రయాలను ప్రోత్సహించారని చంద్రబాబు అన్నారు. తాను విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటును స్వల్పంగా పెంచారని, 14వ తేదీ నుంచి నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమేనని అన్నారు. వైసీపీ నేతలే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు.

ఇసుక కొరతపై బొండా ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టీడీపీ పోరాట కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అందులో సభ్యులుగా అచ్చెన్నాయడు, రామానాయుడు, వర్ల రామయ్య, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బండారు సత్యనారాయణ మూర్తి ఉంటారని తెలిపారు. ఈ నెల 14న ఇసుక దీక్షతో అయినా జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని పేర్కొన్నారు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...