news18-telugu
Updated: May 17, 2019, 6:33 PM IST
గోపాలకృష్ణ ద్వివేది
ఏపీలో రిపోలింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించడంపై రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. వైసీపీ చెప్పినట్లుగా ఈసీ నడుచుకుంటోందని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రీపోలింగ్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన ఫిర్యాదుచేశారు. ఈసీ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ క్రమంలో ఏపీలో రీపోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు.
ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరిలోని ఆ 2 పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని ద్వివేది తెలిపారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, వీడియో సాక్ష్యం ఉండటంతోనే రీపోలింగ్‌కు ఆదేశించామని స్పష్టంచేశారు. ఆ వీడియో చూస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. రెండోసారి రీపోలింగ్ జరపకూడదని ఎక్కడా లేదన్న ద్వివేది.. ఘటన ఆలస్యంగా తమ దృష్టికి రావడం వల్లే ఆదివారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ రోజున విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
తుది విడత ఎన్నికల్లో భాగంగా చంద్రగిరిలో మే 19న పోలింగ్ నిర్వహించనున్నారు. కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318), కమ్మపల్లి (బూత్ నెం.321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
Published by:
Shiva Kumar Addula
First published:
May 17, 2019, 6:33 PM IST