ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి బరిలో ఉండటంతో ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఇరుపార్టీల్లోనూ క్రాస్ ఓటింగ్ జరగడంతో.. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా మెజార్టీ తక్కువగానే ఉంటుందని ఎన్నికల సరళి స్పష్టం చేస్తోంది.
ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా పోరుసాగిన పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బరిలో నిలిచారు. మొదటి నుంచి టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానాల్లో పర్చూరు ఒకటిగా ఆ పార్టీ నమ్మకంతో ఉంది. కానీ, చివరి నిమిషంలో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు వైసీపీ తరఫున బరిలో నిలవడంతో.. టీడీపీ, వైసీపీ ల మధ్య హోరా హోరీ పోరు సాగింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు.. పర్చూరు నుంచి 10, 775 ఓట్లతో విజయం సాధించారు. పదవిలో ఉన్న ఐదేళ్లు అక్కడ వైసీపీ తరఫున బలమైన ప్రత్యర్థి లేకపోవడం, వైసీపీ ఇంఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు గట్టిపోటీ ఇవ్వలేకపోవడంతో మరోసారి ఏలూరి గెలుపు ఖాయమని టీడీపీ నమ్మింది. కానీ, దగ్గుబాటి బరిలో నిలవడంతో సీన్ మారింది. దగ్గుబాటి వెంకటేశ్వర్రావు తనకున్న పరిచయాలతో టీడీపీలోని ద్వితీయశ్రేణి నేతలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. దీనికి ప్రతిగా టీడీపీ కూడా వైసీపీ మాజీ ఇంఛార్జి రావిరామనాథం బాబును టీడీపీలోకి ఆహ్వానించి... దగ్గుబాటికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించింది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు(File)
మార్టూరు, యద్దనపూడి మండలాల్లపై టీడీపీ ఆశలు..!
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభావంతో పాటు.. కమ్మ సామాజికవర్గంలో అధిక శాతం టీడీపీకి మద్దతుగా నిలిచారని ఆ పార్టీ నమ్ముతోంది. దీనికితోడు బీసీలు కూడా టీడీపీ పక్షాన నిలిచారని భావిస్తున్నారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, వైసీపీ నేత రావిరామనాథం బాబు వర్గాలు రెండూ ఏలూరి సాంబశివరావు విజయం కోసం కృషి చేశాయి. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా టీడీపీకి పోలైందనే వాదన ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మార్టూరు - 2750, యద్దనపూడి-988, చినగంజా-795, కారంచేడు-2773, ఇంకొల్లు-971, పర్చూరు మండలాల్లో -2363 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2019లో వైసీపీ తరఫున దగ్గుబాటి వెంకటేశ్వర్రావు బరిలో ఉండటంతో కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో టీడీపీకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ, 2014లో వైసీపీ MLA అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరారు. బలమైన వర్గం ఉన్న గొట్టిపాటి కూడా ఏలూరి గెలుపు కోసం తీవ్రంగా కృషిచేశారు. దీనివల్ల మార్టూరు, యద్దనపూడిలో భారీ ఆధిక్యం సాధిస్తామని టీడీపీ నమ్ముతోంది. ఈ రెండు మండలాల్లోనే కనీసం 6000 మెజార్టీ వస్తోందని.. మిగతా మండాల్లోనూ మరో 3000 ఆధిక్యం ఖాయమని టీడీపీ బలంగా చెబుతోంది. 9000 మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు.. దగ్గుబాటిపై విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు
పర్చూరు, చినగంజాం, ఇంకొల్లుపై వైసీపీ ఆశలు..!
వైసీపీలోనూ ఇదే తరహా లెక్కలు ఉన్నాయి. మార్టూరు, యద్దనపూడి మండలాల్లో టీడీపీకి ఆధిపత్యం వచ్చినా.. పర్చూరు, చినగంజాం, ఇంకొల్లు మండలాల్లో వైసీపీకి ఆధిపత్యం వస్తుందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకి అనుకూలంగా పోలయ్యాయని.. కనీసం, 6000 ఓట్ల మెజార్టీతో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు.
క్రాస్ ఓటింగ్ చీలిక భయం..!
క్రాస్ ఓటింగ్ చీలిక భయం టీడీపీ, వైసీపీలను వెంటాడుతోంది. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మధ్య క్రాస్ ఓటింగ్ జరిగింది. వైసీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ నియోజకవర్గంలో ప్రజలకి పరిచయం లేకపోవడంతో ఆ ప్రభావం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై పడే అవకాశం ఉంది. మొదట లోక్సభ, ఆ తర్వాత అసెంబ్లీ అభ్యర్థులకు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే, ఆ క్లారిటీ లేని చాలా మంది ఓటర్లు మొదట ఎమ్మెల్యే అనుకుని ఓ పార్టీకి, ఆ తర్వాత విషయం తెలుసుకుని మళ్లీ తాము వేయాలనుకున్న పార్టీకే ఓటు వేసే ప్రమాదం కూడా ఉంది.
ప్రతీకాత్మక చిత్రం
జనసేన ప్రభావం..!
పర్చూరు నియజకవర్గంలో జనసేన కూటమి అభ్యర్థిగా బరిలో బీఎస్పీ తరఫున విజయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గం ఓట్లలో బీఎస్పీ ఏమైనా చీలిక తీసుకువచ్చిందా? అనే అనుమానం అభ్యర్థుల్లో ఉంది. చినగంజాం మండలంలో కాపు సామాజికవర్గం ఓట్లు ఉన్నా... చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తరఫున బరిలో ఉండటం, ఆయన కూడా దగ్గుబాటి విజయంకోసం కృషి చేయడంతో కాపుల ఓట్లు జనసేన కూటమికి పోలవ్వలేదని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
ఓటర్ తీర్పు ఎటువైపు..?
ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి బరిలో ఉండటంతో ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఇరుపార్టీల్లోనూ క్రాస్ ఓటింగ్ జరగడంతో.. ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా మెజార్టీ తక్కువగానే ఉంటుందని ఎన్నికల సరళి స్పష్టం చేస్తోంది. వైసీపీ స్పీకర్ అభ్యర్థి గెలుస్తారా? లేక సిట్టింగ్ ఎమ్మెల్యేకి ప్రజలు పట్టం గడతారా అంటే మాత్రం.. మే వరకు ఆగాల్సిందే.
(డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్18)
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.