AP ELECTIONS 2019 TDP CHIEF CHANDRABABU NAIDU HOME TURF KUPPAM ASSEMBLY CONSTITUENCY PROFILE BA
Your Assembly: చంద్రబాబు కంచుకోట కుప్పం.. ప్రచారానికి వెళ్లకపోయినా గెలుస్తున్న సీఎం
మూడో విడుత కింద రూ.3980 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 98లక్షల మందికి దీని ద్వారా లబ్ధి జరగనుంది.
ఈసారి ఎన్నికల్లో కుప్పం నుంచి మరోసారి చంద్రబాబు గెలిస్తే ఏడోసారి విజయం సొంతమవుతుంది. అయితే గత రెండు ఎన్నికల్లో ఆయనకు మెజారిటీ తగ్గుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం.
కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు సమీపంలో ఉన్న టీడీపీ కంచుకోట కుప్పం నియోజకవర్గం.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందించిన ఈ నియోజకవర్గంలో ఎన్నికలు దాదాపు ఏకపక్షంగానే సాగుతుంటాయి. చంద్రబాబు నియోజకవర్గానికి నామినేషన్ వేయడానికి గానీ, ప్రచారం చేసేందుకు కానీ వెళ్లకపోవడం ఇక్కడ విశేషం. 1962 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు ప్రజలు టీడీపీకే విజయాన్ని కట్టబెట్టారు. ఇక్కడ జరిగిన 12 ఎన్నికల్లో టీడీపీ ఏడుసార్లు గెలిచింది. 1985లో టీడీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన రంగస్వామినాయుడు ఇక్కడ విజయం సాధించారు. తర్వాత 1989లో చంద్రబాబు తొలిసారి చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లి పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి ఇదే నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తూ వస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ, విపక్షంలో ఉన్నప్పుడూ, తర్వాత మళ్లీ అధికారం చేజిక్కించుకున్నాక కూడా ఇక్కడ పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదు. అయితే కుప్పంలో చంద్రబాబునాయుడికి 2009తో పోలిస్తే 2014లో మెజారిటీ తగ్గడం కాస్త ఆందోళన కలిగించే అంశం.
నారా చంద్రబాబునాయుడు
కుప్పంలో దాదాపు 2 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 5 వేలు కాగా.. మహిళలు లక్షా 3 వేలు ఉన్నారు. ఓటర్లలో ప్రధానంగా అగ్రవర్ణాలతో పాటు దాదాపు లక్ష మంది బీసీ ఓటర్లు కూడా ఉన్నారు. వీరంతా కొన్నేళ్లుగా టీడీపీకి అండగా ఉన్నారు. అందుకే టీడీపీ అధినేత ఇక్కడ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. వ్యవసాయం, గ్రానైట్ క్వారీలపై ఆధారపడిన కుప్పం ప్రజలకు చంద్రబాబు రెండు దశాబ్దాలుగా ఆశాదీపంలా ఉన్నారు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే వరుస విజయాలకు కారణమవుతుందనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో ఇక్కడ చేపట్టిన బిందు సేద్యం రైతాంగానికి భారీగా లబ్ది చేకూర్చింది. దీంతో పాటు మౌలిక సదుపాయాల విషయంలో చంద్రబాబు తీసుకున్న శ్రద్ధ కూడా కుప్పంలో ప్రజలకు ఎంతో మేలు చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు ప్రచారం చేయకపోయినా కొన్నేళ్లుగా వారు గెలిపిస్తూ వస్తున్నారు.
నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం
1989లో తొలిసారి కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు తరఫున టీడీపీ నేతలు, తన సామాజికవర్గం, బంధుగణం నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెడుతుంటుంది. నియోజకవర్గంలో సమస్యలను సైతం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం, వాటికి పరిష్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అందుకే చంద్రబాబు పండగలు, పబ్బాలకు, వీలు చిక్కినప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వచ్చి ఇక్కడి ప్రజలతో మమేకమవుతుంటారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు పరిస్ధితిని అర్థం చేసుకున్న ఇక్కడి ప్రజలు... స్వయంగా నియోజకవర్గానికి రాకపోయినా ఆయనకు వరుస విజయాలు కట్టబెడుతున్నారు.
నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం
కుప్పం గ్రీన్ పేరుతో ఇక్కడ లభించే గ్రానైట్ కు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. అల్యూమినియం శుద్ధిలో పేరొందిన నార్వే సంస్ధ సాపా ఎక్స్ ట్రూజన్ ఇక్కడ తన బ్రాంచ్ ను నెలకొల్పింది. కుప్పం నియోజకవర్గ కేంద్రానికి బెంగళూరు, చెన్నై నుంచి రైలు రవాణా సదుపాయం ఉంది. కుప్పంలో విద్య, వైద్య సదుపాయాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. అయినా వర్షాభావ ప్రాంతం కావడం ఇక్కడి ప్రజలకు సమస్యగా ఉంటుంది. దీన్ని అధిగమించడానికి బిందు సేద్యాన్ని చంద్రబాబు ఇక్కడ ప్రోత్సహించారు. అది సత్ఫలితాలు ఇవ్వడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.
నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారం
ఈసారి ఎన్నికల్లో కుప్పం నుంచి మరోసారి చంద్రబాబు గెలిస్తే ఏడోసారి విజయం సొంతమవుతుంది. అయితే గత రెండు ఎన్నికల్లో ఆయనకు మెజారిటీ తగ్గుతుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. టీడీపీపై కానీ, చంద్రబాబుపై కానీ వ్యక్తిగతంగా వ్యతిరేకత లేకపోయినా, క్షేత్రస్ధాయిలో నాయకుల వైఖరి వల్లే ఈ మధ్య కొంత వ్యతిరేకత కన్పిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు విజయానికి ఏమాత్రం ఢోకా లేకపోయినా రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నారు.
(సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్18)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.