పవన్‌ కల్యాణ్ జనసేన ఓటమికి కారణాలు ఇవేనా.. ఆ తప్పు వల్లే..?

పవన్ కళ్యాణ్ పోటీచేసిన భీమవరం, గాజువాక రెండు స్థానాల్లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే...

AP Elections 2019: జనసేన పార్టీ 138 చోట్ల పోటీ చేయగా ఒకే ఒక్క సీటు రాజోలులో గెలిచింది. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఛరిష్మా ఏమాత్రం పనిచేయలేదు. పార్టీ నిర్మాణం సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన పవరేంటో చూపిస్తానని పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. పోటీ చేసిన రెండు స్థానాల్లో ఆయన ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో తప్ప ఏ సీటు కూడా దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో ఓటర్లు ఏకపక్షంగా వైసీపీకి పట్టం కట్టడం, ఈ ఎన్నికల్లో జనసేనను ఒక ప్రత్యామ్నాయ పార్టీగా గుర్తించలేకపోవడం ఈ స్థాయి ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ స్వయంగా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పనప్పటికీ.. పార్టీ చేతలు మాత్రం 15-20 వరకు సీట్లు వస్తాయని చెబుతూ వచ్చారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయి. పవన్ కల్యాణ్ ఛరిష్మా గట్టిగానే పనిచేస్తుందని అనుకున్నారు. కానీ, ఆయన సొంత సీట్లో కూడా గెలవలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ-బీజేపీ మద్దతు ఇచ్చి ఆ పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే, 2019 వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది.. పార్టీ నిర్మాణం సరిగా చేయలేకపోవడమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

  కారణాలు ఇవే..
  1. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. ఐదేళ్ల సమయం ఉన్నా సరిగా వినియోగించుకోలేకపోయారు. క్షేత్రస్థాయి కార్యకర్తల్లో, ఓటర్లలో నమ్మకం కలిగించలేకపోయారు. తెలంగాణలో కేడర్ ఉన్నా ముందస్తు ఎన్నికలు వచ్చాయన్న ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉన్నారు. ఏపీలో పట్టు సాధిస్తారని భావించినా, జగన్ ఫ్యాను గాలి ముందు నిలువలేకపోయారు.
  2. గాజు గ్లాసుకు ఓటేస్తే వేరే పార్టీకి ఉపకరిస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. దీంతో ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదు. పైగా, టీడీపీకి జనసేన బీ-టీమ్ అంటూ వైసీపీ నేతలు చేసిన ప్రచారం వర్క్ అవుట్ అయ్యింది.
  3. ప్రధానంగా పవన్‌కు గానీ, పార్టీ నేతలకు గానీ నిర్దిష్ట ప్రణాళిక విధానాలు లేకపోవడం. వామపక్షాలు, మాయావతితో పొత్తు పెట్టుకున్నా ఆ ప్రభావం కనిపించలేదు. ఆ పొత్తు వల్ల పవన్ ఏ మాత్రం లాభపడి ఉండలేదని విశ్లేషకులు అంటున్నారు.
  4. ఇక, పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 18 స్థానాల్లో గెలిచారు. కానీ, తొందరగానే ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ నాటి జ్ఞాపకాలను ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. చిరంజీవిలాగే పవన్ కూడా చేస్తారని అనుకొని జనసేనను దగ్గరికి రానివ్వలేదు.

  ఇదిలా ఉండగా, జనసేన 138 చోట్ల, పొత్తు పెట్టుకున్న సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలు 35 స్థానాల్లో పోటీ చేశాయి గానీ ఏ చోట కూడా తమ మార్కును చూపించలేకపోయాయి. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం మాట్లాడిన పవన్.. తాను తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని, ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటానని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.
  First published: