టీడీపీని దెబ్బకొట్టిన జనసేన.. జగన్‌కు అనుకూలించేలా..

AP Elections 2019: జనసేన ప్రభావం టీడీపీపైనే ఎక్కువ పడింది. ఓట్లను విశ్లేషిస్తే ఏపీలోని 8 లోక్‌సభ, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది.

news18-telugu
Updated: May 24, 2019, 12:47 PM IST
టీడీపీని దెబ్బకొట్టిన జనసేన.. జగన్‌కు అనుకూలించేలా..
జగన్, చంద్రబాబు, పవన్ (File)
  • Share this:
వైసీపీని దెబ్బకొట్టేందుకు జనసేన పార్టీని టీడీపీనే రంగంలోకి దించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వైసీపీ నేతలైతే బహిరంగంగానే టీడీపీ-జనసేన ఒక్కటేనని, జగన్‌ను ఓడిచేందుకే పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించిందని ఆరోపించారు. కానీ, జనసేన ప్రభావం టీడీపీపైనే ఎక్కువ పడటం గమనార్హం. ఓట్లను విశ్లేషిస్తే ఏపీలోని 8 లోక్‌సభ, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది. దానివల్ల ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అభ్యర్థులు సాధించిన మెజారిటీ కన్నా జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో జనసేన మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి బరిలో నిలిచారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 15,881 ఓట్ల మెజారిటీ రాగా, బీఎస్పీ అభ్యర్థికి 41,816 ఓట్లు లభించాయి. జనసేన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు విశాఖ లోక్‌సభ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ సాధించారు. ఆ తర్వాత అమలాపురం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌, సినీ నటుడు నాగబాబుకు వచ్చాయి.

శ్రీకాకుళం, విజయనగరం, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, తదితర 31 నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు టీడీపీ విజయావకాశాలను దెబ్బతీశాయి. అమలాపురం, అనకాపల్లి, కాకినాడ, బాపట్ల, మచిలీపట్నం, నరసాపురం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గాల్లోనూ జనసేన వల్ల టీడీపీ చాలా నష్టపోయింది. జనసేన బరిలో నిలవకపోయి ఉంటే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First published: May 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు