news18-telugu
Updated: February 15, 2020, 4:05 PM IST
అంజద్ బాషా
ఎన్ఆర్సీ మీద కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళితే తాను రాజీనామా చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సంచలన ప్రకటన చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలో అంజద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ‘నాకు పదవులు ముఖ్యం కాదు. నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్ఆర్సీ మీద కేంద్రం ముందుకు వెళితే రాజీనామాకు సిద్ధం. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌ను ఒప్పిస్తా.’ అని అంజద్ బాషా స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదని అంజద్ బాషా తేల్చి చెప్పారు. ‘బీజేపీతో వైసీపీ జట్టుకట్టాల్సిన దౌర్భాగ్యం పట్టలేదు. మేం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ద్రోహం చేసి బీజేపీతో కలవం. జగన్‌కు బీజేపీ రంగు పూయాలని 2011 నుంచి కుయుక్తులు పన్నుతున్నారు. సోషల్ మీడియాలో కల్పిత ప్రచారాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో జట్టుకట్టబోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈ రోజు ఆ పార్టీతోనే జట్టుకడుతున్నారు. వారంతా నిలకడలేని వారు. మాకు 151 సీట్లు ఉన్నాయి. ఆ దౌర్భాగ్యం మాకు లేదు.’ అని అంజద్ బాషా అన్నారు. వైసీపీ సెక్యులర్ పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జగన్‌ను సీఎం చేశారని, వారి మనోభావాలు దృష్టిలో పెట్టుకుంటామని అంజద్ బాషా తెలిపారు.

అంజాద్ బాషా(కడప జిల్లా)
ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంతో వైసీపీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరబోతోందంటూ ప్రచారం జరిగింది. బీజేపీ, వైసీపీ జట్టుకడితే కేంద్రంలో రెండు మంత్రిపదవులు కూడా ఆఫర్ చేశారని, దీనిపై జగన్ నిర్ణయం తీసుకోవడమే పెండింగ్ ఉందని ప్రచారం జరిగింది. విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌లకు కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం కూడా సాగింది.

ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్
రాష్ట్రంలో సీఏఏకి చోటు లేదంటూ సీఎం జగన్ గతంలో ప్రకటించారు. రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, మైనారిటీ ఓట్ బ్యాంక్‌ను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ బీజేపీతో జట్టుకట్టకపోవచ్చే వాదన కూడా ఉంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
February 15, 2020, 4:05 PM IST