రేపిస్టులకు రెండు దెబ్బలే చాలా? పవన్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం

రేపిస్టులను కఠినంగా శిక్షించకుండా కేవలం బెత్తంతో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందా..ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఇంత చులకనా అని పుష్ప శ్రీవాణి మండిపడ్డారు.

news18-telugu
Updated: December 4, 2019, 3:57 PM IST
రేపిస్టులకు రెండు దెబ్బలే చాలా? పవన్‌పై డిప్యూటీ సీఎం ఆగ్రహం
పవన్ , పుష్ప శ్రీవాణి
  • Share this:
దిశా హత్యాచారం కేసుపై యావత్ దేశం భగ్గుమంటోంది. నలుగురు నిందితులకు ఉరి శిక్ష వేయాలంటూ ప్రజలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని బెత్తంతో కొట్టాలన్న ఆయన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. రేపిస్టులను కఠినంగా శిక్షించకుండా కేవలం బెత్తంతో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందా..ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఇంత చులకనా అని ఆమె మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.

పుష్ప శ్రీవాణి బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పవన్ వాఖ్యలపట్ల తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆడపిల్లల ప్రాణం, మానం అంటే పవన్ కళ్యాణ్‌కి ఇంత చిన్న చూపా..? అని నిలదీసారు. దిశా ఘటన తరువాత యావత్ దేశం ఒక్కటై హత్యాచారం చేసిన వాళ్లకు కఠినమైన శిక్షలు పడాలని నినదిస్తున్నారని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రేప్ చేసిన వారిని బెత్తంతో కొట్టి వదిలేయమంటారా...? ఓ బాధ్యతగల రాజకీయ పార్టీ అధ్యక్షుడు మహిళలంటే ఇంత చులకన భావంతో మాట్లాడటం సహించరాని విషయమని దుయ్యబట్టారు. తక్షణం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేసారు.

ఐతే వైసీపీ విమర్శలపై జనసేన నేతలు ఎదురు దాడికి దిగారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు, మంత్రులు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని బెత్తంతో కొట్టాలని మాత్రమే ఆయన అన్నారని.. అంతే తప్ప దిశా కేసు నిందితులకు కఠిన శిక్షలు వేయకూడదని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. వైసీపీ నాయకులు పనిగట్టుకొనీ మరీ పవన్ కళ్యాణ్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>