ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఒత్తడిని తట్టుకోలేకపోతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా ఇన్ని బాధలు లేవని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ నేతల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. శనివారం చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. గ్రూప్ రాజకీయాలు, జల్లికట్టు నిర్వాహణకు అనుమతి లభించకపోవడం తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. తనపై చాలా ఒత్తిడి ఉందన్నారు. ఎంత వినయంగా ఉన్నప్పటికీ.. గ్రూప్ రాజకీయాలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. గ్రామం నుంచి కొందరిని తరిమేయాలని తనపై వస్తున్న ఒత్తిళ్లను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రస్తావించారు.
గ్రామం నుంచి కొందరిని తరిమేయడం ఎలా కుదురుతుందని సొంత పార్టీ నేతలను ప్రశ్నించారు. ఇలాంటి చట్టం ఎక్కడైనా ఉందా అని సొంత పార్టీ నేతలను ఆయన నిలదీశారు. మీరు వద్దంటే రాజకీయాల నుంచి తప్పుకొంటా.. మీ ఇష్టం చెప్పండి అంటూ వాపోయారు. తాను అందరిలాగా రాజకీయాలు చేయడం లేదని.. పద్దతులు అనుసరిస్తున్నానని పార్టీ నేతలకు తెలిపారు.
అలాగే జల్లికట్టుపైన తానేమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జల్లికట్టు నిర్వాహణకు సంబంధించి ఎస్పీతో మాట్లాడినట్టు చెప్పారు. ఇతర ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చారని, తమిళనాడులో కూడా జల్లికట్టు నిర్వహిస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అయితే ఎస్పీ మాత్రం జల్లికట్లు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని.. ఇందుకు తానేమి చేయలేనని అన్నారు.
Published by:Sumanth Kanukula
First published:January 17, 2021, 15:23 IST