news18-telugu
Updated: January 31, 2019, 2:12 PM IST
కేఈ కృష్ణమూర్తి(ఫైల్ ఫోటో)
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన మంత్రి కేఈ... అమరావతిలో జరిగిన శ్రీవారి ఆలయ భూకర్షణానికి తనను ఆహ్వానించకపోవడంపై అసంతృప్తి చేశారు. . ఈ సందర్భంగా దేవాదాయశాఖ, టీటీడీకి సంబంధించిన పలు అంశాలపై మంత్రి స్పందించారు. టీటీడీలో కొందరు అధికారులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని వ్యాఖ్యానించిన మంత్రి కేఈ కృష్ణమూర్తి... టీటీడీ అధికారులను దారికితేవడంలో ప్రభుత్వ పెద్దలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం ట్రస్టు బోర్డు నియామకం కోసం ముఖ్యమంత్రికి ఫైలు పంపి మూడు నెలలైందని ఆయన తెలపారు.
ట్రస్టు బోర్డు నియామకంలో ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి బోర్డు విషయంలో ఒత్తిడి వస్తోందని సీఎం చంద్రబాబుకు వివరించానని మంత్రి కేఈ వెల్లడించారు. పెద్ద ఆలయాలకు ట్రస్టు బోర్డులు ఏర్పాటు చేయకుంటే అనేక సమస్యలు వస్తాయని వ్యాఖ్యానించారు. క్లిష్టమైన రెవెన్యూ శాఖ కన్నా దేవాదాయ శాఖ కష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి దేవాదాయ శాఖ వదులుకోవాలని అనిపిస్తుందని నిర్వేదం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా ఉండవని కేఈ కృష్ణమూర్తి కామెంట్ చేశారు.
మరోవైపు అమరావతి టీటీడీ ఆలయ భూకర్షణ కార్యక్రమానికి మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆహ్వానించకపోవడంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. దీనిపై టీటీడీ అధికారులను సీఎంవో వివరణ కోరింది. అయితే మంత్రి కేఈకి ఆహ్వానం పంపామని సీఎంవోకు టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై మంత్రి కేఈని కలిసి వివరణ ఇవ్వాలని టీటీడీ అధికారులకు సీఎంవో ఆదేశించినట్టు తెలుస్తోంది.
First published:
January 31, 2019, 2:12 PM IST