Home /News /politics /

AP CS LV SUBRAMANYAM DELHI TOUR IS HE COMPLAINING ON CHANDRABABU NAIDU OR HE WANTS TO STEP DOWN BA

ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్.. తెరపైకి మూడు కారణాలు..

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం చంద్రబాబునాయుడు

సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం చంద్రబాబునాయుడు

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశానికి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హాజరయ్యేందుకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, రాష్ట్రంలో పాలనా సంక్షోభం తలెత్తకుండా సీఎస్ ను పిలిపించుకుని తగు సూచనలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
  ఏపీలో సీఎం వర్సెస్ ఈసీగా కోల్డ్ వార్ సాగుతున్న నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఢిల్లీ పర్యటనకు వెళ్లడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కేంద్రానికి నివేదించేందుకే ఎల్వీ ఢిల్లీ వెళ్లారా అన్న చర్చ సాగుతోంది. పైకి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లినట్లు చెబుతున్నా... రాష్ట్రంలో రివ్యూ మీటింగ్స్ విషయంలో సాగుతున్న రచ్చపై ఫిర్యాదు చేసేందుకే వెళ్లారా అన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో పాలనాపరమైన సమీక్షలు నిర్వహించే విషయంలో తనకు అడ్డుచెబుతున్న సీఎం చంద్రబాబు, ఆయన కేబినెట్ మంత్రులపై సహజంగానే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు చెప్పినట్లు ఆడుతున్నారన్న కారణంతో ఈసీ గత సీఎస్ పునేఠాను తప్పించి ఆయన స్ధానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. దీనిపై సీఎం చంద్రబాబు బహిరంగంగానే విరుచుకుపడ్డారు. జగన్ కేసుల్లో నిందితుడికి సీఎస్ పగ్గాలు ఎలా అప్పజెబుతారంటూ నిప్పులు చెరిగారు. దీనిపై ఓ దశలో సీఎస్ గా ఉన్న ఎల్వీఎస్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయినా వివాదం సద్దుమణగలేదు.

  Ap cs LV Subramanyam, Andhra Pradesh chief secretary, tdp, chandrababu naidu, ap cm chandrababu naidu, ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, టీడీపీ, చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
  ఏపీ సీఎస్ఎల్వీ సుబ్రమణ్యం(ఫైల్ ఫోటో)


  పోలవరం, సీఆర్డీఏపై సీఎం నిర్వహించిన సమీక్షలపై ఈసీ సీరియస్ కావడంతో సదరు సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారో ఏమో తానే సమీక్షలు నిర్వహించడం మొదలుపెట్టారు. దీనిపైనా టీడీపీ మంత్రులు రోజుకో రకంగా విమర్శలకు దిగుతున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ ఉండగా, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ సీఎంతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎల్వీఎస్... సీఈవో ద్వివేదీతో కలిసి మాత్రమే తాను కలెక్టర్ల సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

  చంద్రబాబునాయుడు


  తాజాగా ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ లో కేటాయింపులున్నా ప్రభుత్వ పథకాలకు నిధులు జారీ చేయడం లేదంటూ సీఎస్ పై నిప్పులు చెరిగారు. ఇలా రోజుకో రకంగా తనను సీఎంతో పాటు టీడీపీ నేతలు, మంత్రులు టార్గెట్ చేయడంపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అసహనంగా ఉన్నారు. ఈ దశలో ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. పైకి గ్రీన్ ట్రిబ్యునల్ మీటింగ్ కు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు చెప్పినా... ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్రంలో పరిస్ధితులను వివరించాలనే ఉద్ధేశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తాం, చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చంటూ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ను, యనమల విమర్శలను ఆయన ఈసీ లేదా కేంద్ర హోంశాఖ పెద్దలకు నివేదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సౌమ్యుడిగా పేరున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం... ఏపీ సర్కారుతో వివాదాలకు ఇష్టపడటం లేదని సమాచారం. అందుకే తనను తప్పించాలని ఈసీని కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

  సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం చంద్రబాబునాయుడు


  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలతో పాటు తాజా పరిస్ధితులను నిశితంగా గమనిస్తున్న కేంద్రం.. సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రాష్ట్రంలో పాలనా సంక్షోభం తలెత్తకుండా సీఎస్ ను పిలిపించుకుని తగు సూచనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అప్పటికీ వివాదాలు సద్దుమణగకపోతే చివరి ఆప్షన్ గా రాష్ట్రపతి పాలన వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదని సమాచారం. ఏదేమైనా ఎల్వీఎస్ ఢిల్లీ పర్యటనలో అధికారికంగా ఎవరిని కలుస్తారనే అంశాన్ని బట్టి అన్ని ఆప్షన్లు ఆధారపడి ఉంటాయని తెలుస్తోంది.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP CS LV Subramanyam, Chandrababu naidu, Election Commission of India, Lok Sabha Election 2019

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు