టార్గెట్ టీడీపీ ఎమ్మెల్యే... సీటు మారనున్న రఘువీరారెడ్డి

రఘువీరారెడ్డి(ఫైల్ ఫోటో)

గత ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేసిన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి... ఈ సారి సీటు మారాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సారి కళ్యాణదుర్గం నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ... అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతమంది నాయకుల కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతారో తెలియదు కానీ... రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి... మళ్లీ తనకు కలిసొచ్చిన స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 2014లో పెనుగొండ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన రఘువీరారెడ్డి... ఈ సారి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

  2009 నుంచి 2014 వరకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా వ్యవహరించిన రఘువీరారెడ్డి... రాష్ట్ర విభజన అనంతరం సీటు మారారు. అయితే రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో... రఘువీరారెడ్డికి ఘోర ఓటమి తప్పలేదు. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంత మెరుగైందని భావిస్తున్న ఏపీసీసీ చీఫ్, మాజీమంత్రి రఘువీరారెడ్డి... కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

  అయితే ప్రస్తుతం కళ్యాణదుర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో... రఘువీరారెడ్డి ఎంట్రీతో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి, టీడీపీ, వైసీపీ పోటీలో ఉంటే కళ్యాణదుర్గంలో త్రిముఖ పోటీ ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి... టీడీపీ సిట్టింగ్ సీటుపై కన్నేసిన రఘువీరారెడ్డి... కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తారా అన్నది చూడాలి.

  ఇవి కూడా చదవండి
  First published: