కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్‌కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ లేఖ... పార్టీకి సంబంధం లేదన్న తెలంగాణ కాంగ్రెస్ నేత

తెలంగాణ సీఎం కేసీఆర్( ఫైల్ ఫోటో)

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడం ప్రాధాన్యత సంతకరించుకుంది.

  • Share this:
    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు సంచలన లేఖ రాశారు. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరారెడ్డి... కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారనే విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. టీఆర్ఎస్‌తో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు కూడా మద్దతు తెలపాలని రఘువీరారెడ్డి కోరారు.

    ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి మద్దతు ఇవ్వొద్దన్న ఆయన కేంద్రంలో తమతో కలిసి ముందుకు రావాలని కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య బద్ధ శత్రుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలంటూ రఘువీరారెడ్డి రాసిన లేఖ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రఘువీరారెడ్డి లేఖతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత గూడురు నారాయణరెడ్డి అన్నారు. ఇది పూర్తిగా రఘువీరారెడ్డి వ్యక్తిగతమని ఆయన తెలిపారు. ఏదేమైనా... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రఘువీరారెడ్డి కేసీఆర్‌కు లేఖ రాయడం తెలంగాణ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామంగా మారిందనే చెప్పాలి.
    First published: