కర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్.. టీడీపీలోకి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ముంగిట సేఫ్ జోన్‌ను ఎంచుకుంటున్న నాయకులు.. పార్టీలు మారుతూ రాష్ట్ర రాజకీయాల్లో హీటు పెంచేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత.. టీడీపీలో చేరబోతున్నారు.

 • Share this:
  రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో జీరోగా మారిపోయి... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టుగా అనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అంతలోనే అనుకోని షాక్ తగిలింది. కర్నూలు జిల్లాలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయనకు మద్దతుగా జిల్లావ్యాప్తంగా ఉన్న యువజన కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులంతా రాజీనామాలు చేశారు. కోట్ల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని.. ప్రకటించారు.

  కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబాబునాయుడితో భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ భేటీ జరగనుంది. తనయుడు రాఘవేంద్ర, సతీమణి సుజాతమ్మలను కూడా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తనతో తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడే చంద్రబాబుతో కలిసి కోట్ల కుటుంబం భోజనం చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు నుంచే కోట్లకు ఆహ్వానం అందిందనే ప్రచారం జరుగుతోంది. కర్నూలు ఎంపీ స్థానంతో పాటు మరో మూడు శాసన సభస్థానాలను తనవర్గానికి కేటాయించాలని కోట్ల కోరినట్టు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారనేది, సాయంత్రం జరిగే భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది. కోట్ల కుటుంబసభ్యుల్లో ఒకరిద్దరు సైతం ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  కోట్ల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సూర్యప్రకాశ్ రెడ్డికి సైతం కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇచ్చింది. యూపీఏ2 పాలనలో సూర్యప్రకాశ్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.  దశాబ్దాలుగా కాంగ్రెష్ పార్టీలో కొనసాగిన కోట్ల కుటుంబం.. మారిన రాజకీయ పరిస్థితుల ద‌ృష్ట్యా టీడీపిలోకి  వెళుతోంది.

   
  First published: