ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న జలయుద్ధం.. కేంద్రానికి జగన్ లేఖ

కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని.. కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.

news18-telugu
Updated: August 11, 2020, 8:57 PM IST
ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న జలయుద్ధం.. కేంద్రానికి జగన్ లేఖ
కేసీఆర్, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ, తెలంగాణ మధ్య జలయుద్ధం ముదురుతోంది. పోతిరెడ్డి ప్రాజెక్టుపై తీవ్ర దుమారం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం అర్ధం లేని ఆరోపణలతో అనవసర రాద్దాంతం చేస్తోందని సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమ వాదనలను బలంగా వినిపించి..ఏపీ ప్రభుత్వం నోరుమూయిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఇటీవల కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రాసిన లేఖపై ప్రత్యుత్తరం పంపారు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి సంబంధించి అజెండా ఖరారు చేశామని, రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని అందులో పేర్కొన్నారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఏపీ నుంచి స్పందన లేదంటూ ఈనెల 7న రాసిన లేఖ సరికాదని సీఎం జగన్‌ తెలిపారు. ఇక కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు కొత్తవి కాదని.. కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్. 2015లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB) సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరిందని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదని.. నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదని తెలిపారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా సమర్థ వినియోగానికే ఎత్తిపోతలు చేపట్టామని స్పష్టం చేశారు సీఎం జగన్.

కాగా, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సోమవారం జల వనరులశాఖ అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరిపై చర్చించి.. అనంతరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని..కేంద్రం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని మండిపడ్డారు. నా అంతట నేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడానని.. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహహస్తం అందించామని అన్నారు. బేసిన్లు లేవు.. బేషజాలు లేవని చెప్పినప్పటికీ.. ఏపీ ప్రభుత్వం కెలికి మరీ కయ్యం పెట్టుకుంటోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Published by: Shiva Kumar Addula
First published: August 11, 2020, 8:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading