Home /News /politics /

రేపు ప్రధాని మోదీతో జగన్ భేటీ.. ఏం జరగబోతోంది?

రేపు ప్రధాని మోదీతో జగన్ భేటీ.. ఏం జరగబోతోంది?

మోదీని కలిసిన జగన్ (File)

మోదీని కలిసిన జగన్ (File)

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన సమస్యల సత్వర పరిష్కారం, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి డిప్యుటేషనన్ వ్యవహారం కూడా ప్రధానితో జగన్ భేటీ తర్వాత కొలిక్కి వచ్చే అవకాశముంది.

  ఓ వైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారంలో ఎదురు దెబ్బలు, మరోవైపు పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ అమలు చేద్దామంటే కేంద్రం ప్రతికూల సంకేతాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై వివరణలు... రేపు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ప్రస్తావించే అంశాల అజెండా స్ధూలంగా ఇది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎలాగూ ప్రతిసారీ ప్రస్తావిస్తూనే ఉంటానని ఇప్పటికే జగన్ స్పష్టం చేశారు. అయితే గతానికి భిన్నంగా కేంద్ర పెద్దలతో పలు కీలక అంశాలపై లాబీయింగ్ ఈసారి కీలకం కానుంది. ఏపీలో అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ అమలుపై పట్టుదలగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి... తన పంతాన్ని నెగ్గించుకునేందుకు వీలుగా రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. మోదీ, జగన్ భేటీలో పోలవరం, పీపీఏలతో పాటు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపైనా చర్చ జరిగే అవకాశముంది. తాజా బడ్జెట్ అంచనాలు, వాటి అమలుకు కేంద్ర సాయం, అప్పుల సేకరణ వంటి అంశాలు ప్రధాని, ముఖ్యమంత్రి భేటీలో కీలకంగా చర్చకు రానున్నాయి. వీటితో పాటు విభజన సమస్యల సత్వర పరిష్కారం, ప్రత్యేక హోదా వంటి అంశాలు ఎలాగో ఉండనే ఉన్నాయి. ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, సీనియర్ నేతలతో జగన్ భేటీ కాబోతున్నారు.

  ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అంశం అంతకంతకూ చర్చనీయాంశమవుతోంది. ధరలు తగ్గించుకోవాలంటూ పునరుత్పాదక విద్యుత్ సంస్ధలకు ఏపీ డిస్కమ్ లు ఇచ్చిన నోటీసులపై ఆయా సంస్ధలు హైకోర్టుకు వెళ్లడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీపీఏల సమీక్షా కమిటీ నియామకంపై స్టే ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. గతంలో కేంద్రం కూడా పీపీఏల సమీక్ష వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని రెండు లేఖలు రాసింది. అయినా వాటిని పట్టించుకోకుండా జగన్ సర్కారు ముందడుగు వేసింది. దీంతో ఈసారి ప్రధానితో భేటీలో ఇదే అంశం మరోసారి ప్రస్తావనకు రానుంది. పీపీఏల రివ్యూ విషయంలో విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అభిప్రాయం తోనే ముందుకెళ్తామని హైకోర్టుకు జగన్ ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో మోదీ ఈసారి జగన్ కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది కీలకంగా మారింది. దీని ఆధారంగా జగన్ ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఆధారపడనుంది.

  ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం రివర్స్ టెండరింగ్ వ్యవహారంలోనూ కేంద్రమంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కారుకు ఎదురుదెబ్బగా మారాయి. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమవుతాయని, ఎప్పుడు పూర్తవుతాయో కూడా చెప్పలేమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలు మోదీ సర్కారు అభిప్రాయమా లేక ఆయన వ్యక్తిగతమా అన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు. దీనిపైనా సీఎం జగన్ స్పష్టత కోరే అవకాశముంది. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.500 కోట్లు మిగిలే అవకాశముంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ వాదనను మోదీ కూడా అంగీకరిస్తే రివర్స్ టెండరింగ్ కు చిక్కులు తొలగిపోవచ్చని భావిస్తున్నారు.
  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన సమస్యల సత్వర పరిష్కారం, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి డిప్యుటేషనన్ వ్యవహారం కూడా ప్రధానితో జగన్ భేటీ తర్వాత కొలిక్కి వచ్చే అవకాశముంది.

  (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pm modi, Polavaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు