news18-telugu
Updated: January 25, 2020, 6:20 PM IST
ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గం చివరి వ్యూహాల్లో నిమగ్నమైంది. ఏపీలో జోరుగా ఎమ్మెల్సీల బేరసారాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలోని కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు వైసీపీ ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో ఓ సీనియర్ మంత్రి నివాసంలో భేటీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తమ ఎమ్మెల్సీలను వైసీపీ తమవైపు తిప్పుకుందని ఇప్పటికే టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొందరు మంత్రులు, నేతలు తమ ఎమ్మెల్సీలకు వైసీపీ నేతలు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని శాసనమండలి సాక్షిగా యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును గట్టెక్కించుకోకపోతే మండలిని రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. దీంతో వారంతా వైసీపీ వైపు మొగ్గుతారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రలోభాలకు లొంగవద్దంటూ ఇప్పటికే ఎమ్మెల్సీలకు చంద్రబాబు హితబోధ చేశారు. ప్రలోభాలకు లొంగని వారికి భవిష్యత్తుపై హామీ ఇస్తామని చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. వారికి అవసరమైన నిధులు తామే పార్టీ తరఫున అందిస్తామని చెబుతున్నారు. రేపు ఉదయం వరకూ సాధ్యమైనంత ఎక్కువ మంది ఎమ్మెల్సీలను ఆకర్షించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ అనుకున్నంత మంది ఎమ్మెల్సీలు టీడీపీ నుంచి వైసీపీవైపునకు మళ్లితే శాసనమండలి రద్దు ప్రతిపాదన వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 25, 2020, 6:20 PM IST