జెరూసలేం వెళ్లొచ్చాక జగన్ మొదట చేసే పని ఇదేనా..

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఆ వెంటనే సీఎం జగన్ కుటుంబంతో కలిసి జెరూసలేం యాత్రకు వెళ్లనున్నారు. తిరిగి ఆగస్టు 5న జగన్ ఇంటికి చేరుకుంటారు.

news18-telugu
Updated: July 28, 2019, 5:44 PM IST
జెరూసలేం వెళ్లొచ్చాక జగన్ మొదట చేసే పని ఇదేనా..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడంతో పదేళ్లుగా కష్టనష్టాలకు ఓర్చి పార్టీకి అండగా నిలిచిన వారు, పార్టీని నమ్ముకుని ఉన్నవారంతా తమ పంట పండిందని భావించారు. కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది. అదే సమయంలో ఇప్పటికే ఓ పదవి ఇచ్చిన ఎమ్మెల్యేలకు రెండో పదవి కూడా ఇస్తుండటం వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది.
ఏపీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున ఆ పార్టీలో చేరారు. ఇందులో టీడీపీ, జనసేన నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరు కాక వైసీపీ ప్రారంభం నాటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. వీరిలో చాలా మంది పదేళ్లలో ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీ తరఫున రాజకీయాలు చేశారు. వీరికి జగన్ పాదయాత్రతో పాటు పలు సందర్భాల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టే పరిస్ధితి ఉండబోదని చెప్పారు. సహజంగానే వైఎస్ కుటుంబానికి మాట ఇస్తే తప్పరనే పేరు కూడా ఉంది. దీంతో జగన్ సీఎం రావాలన్న ఏకైక లక్ష్యంతో రాత్రింబవళ్లూ శ్రమించి వైసీపీని కనీవినీ ఎరుగని రీతిలో అధికారంలోకి తీసుకొచ్చారు.

అంతవరకూ బాగానే ఉన్నా వైసీపీ అధికారంలోకి వచ్చిన ముహూర్తమో ఏమో తెలియదు కానీ సీఎం జగన్ ఎప్పుడూ లేనంత బిజీగా మారిపోయారు. ఓవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ నడపాల్సిన పరిస్ధితి జగన్ కు ఊపిరి సలపనీయడం లేదు. దీంతో జగన్ అధికారంలోకి వస్తే మంత్రులు, ఇతర పదవులు వస్తాయని ఆశించిన పలువురికి నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ సందర్భంలోనూ జగన్ పలువురు సీనియర్లకు, పదవులు ఆశించిన వారికి భవిష్యత్ పై హామీ ఇచ్చారు. దీంతో వారంతా కొంతకాలం వేచి చూశారు. అదే సమయంలో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని రోజా, చెవిరెడ్డి, దాడిశెట్టి రాజా వంటి వారికి నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పించడం, అందులోనూ చెవిరెడ్డి వంటి వారికి జోడు పదవులు అప్పజెప్పడం వంటి అంశాలు ఆశావహుల్లో అసంతృప్తిని రాజేస్తున్నాయి. దీంతో ఓ దశలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పలువురితో సమావేశమై ఎవరికీ జగన్ అన్యాయం చేయరని హామీ కూడా ఇచ్చారు.

ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఆ వెంటనే సీఎం జగన్ కుటుంబంతో కలిసి జెరూసలేం యాత్రకు వెళ్లనున్నారు. తిరిగి ఆగస్టు 5న జగన్ ఇంటికి చేరుకుంటారు. అనంతరం పది రోజుల విరామం తర్వాత తిరిగి అమెరికా యాత్ర వెళ్లాల్సి ఉంది. దీంతో ఆ పది రోజుల్లోనే పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల భర్తీ ఉండొచ్చని తెలుస్తోంది. క్షణం తీరికలేకుండా గడుపుతున్న జగన్.. సచివాలయంలో తన టీమ్ తో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై జెరూసలేం యాత్ర తర్వాత దృష్టిసారించనున్నారు. అప్పటివరకూ ఆశావహులంతా ఎదురుచూడక తప్పని పరిస్ధితి నెలకొంది.
మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో పాటు పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారు, రాయలసీమకు చెందిన నేతలు చాలా మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే హామీ ఇచ్చిన వారికి మాత్రం కచ్చితంగా పదవులు దక్కుతాయని తెలుస్తోంది.(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు