AP CM YS JAGAN TWO DAYS TOUR IN KADAPA DISTRICT THERE IS NO FACE TO FACE MEETING BETWEEN JAGAN AND SHARMILA NGS
AP CM Ys Jagan: సీఎం జగన్ పులివెందుల షెడ్యూల్ ఇదే.. పర్యటనలో మార్పులకు కారణం అదే..!
వైఎశ్ జగన్ (ఫైల్)
AP CM Ys Jagan: ఒకే రోజు సీఎం జగన్, వైఎస్ షర్మిళ పులివెందులకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఇద్దరు ఎదురు పడకుండా జాగ్రత్త పడుతున్నారా..? అందుకే సీఎం జగన్ రెండు రోజుల షెడ్యూల్ లో మార్పులు చేశారా..? ప్రస్తుతం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోడానికి కూడా ఇష్ట పడడం లేదా..?
AP CM Ys Jagan: చాలా గ్యాప్ తరువాత ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప జిల్లాపర్యటన ఖరారైంది. అయితే ఈ సారి పర్యటన రాజకీయంగా తీవ్ర ఆసక్తి పెంచుతోంది. ముఖ్యంగా అన్నతో విబేధాలున్నాయనే వార్తల నేపథ్యంలో వైఎస్ షర్మిళ ఇప్పటికే తెలంగాణలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఈనెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజునే పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. మరోవైపు అదే రోజున కుటుంబ సభ్యులంతా కలిసి ఇడుపులపాయలో తండ్రికి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం మారిన పరిణామాల నేపథ్యంలో... ముఖ్యమంత్రి జగన్, ఆయన సోదరి షర్మిల ఎవరికి వారు గా తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ ఘాట్‌లో పరస్పరం ఎదురుపడకుండా... సీఎం షెడ్యూలునే మార్చుకున్నట్లు సమాచారం. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం... ఈనెల 7వ తేదీనే ఆయన సాయంత్రం కడప జిల్లాకు చేరుకుని.. రాత్రి ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్టు హౌస్‌లో బస చేయాలి. 8వతేదీ ఉదయం వైఎస్సార్ ఘాట్‌లో జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలి. అయితే... తండ్రి జయంతి రోజునే తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు షర్మిల ముందే తెలిపారు. ఆ మేరకు... ఆమె 8వ తేదీ ఉదయాన్నే బెంగళూరు నుంచి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని నివాళులర్పించి, తరువాత ఆమె తెలంగాణకు చేరుకుని సాయంత్రం జరిగే పార్టీ ఆవిర్భావ బహిరంగ సభలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ టూర్ లో మార్పులు చేశారని ప్రచారం జరుగుతోంది.
సీఎం జగన్ తాజా షెడ్యూల్ ప్రకారం ఈనెల 8,9 తేదీల్లో బద్వేలు, కడప, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి పలు అభివృధ్ది కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన గురించి జిల్లా కలెక్టర్ హరినారాయణ అందించిన వివరాల ప్రకారం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీన ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 8.50 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 9.55 గంటలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.40 నుంచి అనంతపురం జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి బయలుదేరి 1.50 గంటలకు తన నివాసానికి చేరుకుని 2.00 గంటల వరకు అక్కడే ఉంటారు.
సీఎం జగన్ తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే.. అప్పటికే చెల్లి షర్మిళ తన షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ రిటన్ అవుతారు. హైదరాబాద్ ల పార్టీ సభలో ఆమె పాల్డొనాల్సి ఉంటుంది. ఇలా ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు పడకుండానే పులివెందుల షెడ్యూల్ ను ఫిక్స్ చేశారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీఎం జగన్ మధ్యాహ్నం 2 గంటల15 నిమిషాలకు తన నివాసం నుంచి పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 2.25 గంటల నుంచి 3.00 గంటల వరకు అక్కడ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
3.05 గంటలకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్‌నుంచి పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.15 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 3.35 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుంటారు. 3.40 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుని 4.00 నుంచి 4.45 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 4.50 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.