జగన్ మరో ఆపరేషన్.. చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి

విశాఖపట్నం నగరంతో పాటు జిల్లాలోనూ వైసీపీ నాయకత్వ లేమితో సతమతం అవుతోంది. త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా విజయబావుటా ఎగరేయాలని వైసీపీ భావిస్తోంది.

news18-telugu
Updated: September 1, 2019, 8:04 PM IST
జగన్ మరో ఆపరేషన్.. చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ఆలింగనం (File)
  • Share this:
ఏపీలో భారీ మెజారిటీతో అధికారం చేపట్టి వంద రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ తొలిసారిగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసినట్లేనా? చేరికలపై మౌనంగా ఉంటే సమయం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ ఆ ఛాన్స్ తీసుకుంటుందన్న భయమే ఇందుకు కారణమా? అందుకే విశాఖ కేంద్రంగా ఇవాళ ఆపరేషన్ ఆకర్ష్ కు వైసీపీ తెరదీసిందా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. అంతటితో ఆగకుండా త్వరలో జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ వైసీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు నాయకులకూ కొరత లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఇప్పుడు వైసీపీలో తమ హవా కొనసాగిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు భారీగా పార్టీలో చేరినవారితో పాటు గతంలో వైసీపీ ప్రారంభం నుంచి ఉన్న నేతలూ ఇందులో ఉన్నారు. వీరందరికీ పదవులు ఇవ్వలేక సీఎం జగన్ సైతం సతమతం అవుతున్న పరిస్ధితులు ఉండనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలో తాజాగా మారుతున్న పరిస్ధితుల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో చతికిలపడిన టీడీపీ స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీకి భవిష్యత్తులో తలనొప్పులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ కూడా అప్రమత్తమైంది. గతంలో తాము విధించుకున్న లక్ష్మణరేఖ దాటకుండానే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ముందుగా పార్టీ బలహీనంగా ఉన్న విశాఖపట్నం నగరంపై వైసీపీ దృష్టిసారించింది. ఇవాళ విశాఖ డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చుకున్న వైసీపీ... త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్న సంకేతాలు ఇచ్చేసింది. విశాఖ జిల్లా వ్యవహారాలను కొంతకాలంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి చేరికలపై విపక్ష టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. అన్నీ అనుకూలిస్తే టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రితో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే టీడీపీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదని భావిస్తున్న వీరంతా త్వరలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

విశాఖపట్నం నగరంతో పాటు జిల్లాలోనూ వైసీపీ నాయకత్వ లేమితో సతమతం అవుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నేతలను ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా విజయబావుటా ఎగరేయాలని భావిస్తున్న వైసీపీ... టీడీపీ నుంచి భారీగా చేరికలను ప్రోత్సహిస్తోంది. పార్టీ నేతలైతే రాజీనామా చేసి వైసీపీలో చేరడం ఖాయమే. కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మాత్రం వైసీపీ నియమాల ప్రకారం తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. దీంతో టీడీపీ నుంచి వైసీపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు మాత్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీడీపీని వదులుకున్న తర్వాత వైసీపీ అధినాయకత్వం తమకు ఏమేరకు అండగా ఉంటుంది, తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఎలాంటి హామీలు ఇస్తుంది, పార్టీలో చేరి ఉపఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చినప్పుడు తమకు ఏమేర సాయం చేస్తుందనే అంశాలు ఆయా నేతలను పట్టి పీడిస్తున్నాయి. అయితే విజయసాయిరెడ్డి మాత్రం అన్ని అంశాలు తాము చూసుకుంటామన్న హామీని వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
Published by: Ashok Kumar Bonepalli
First published: September 1, 2019, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading