news18-telugu
Updated: October 9, 2019, 5:37 AM IST
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు చినికి చినికి గాలివానగా మారింది. ఈ వ్యవహారం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు చేరింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల అరెస్ట్ అయ్యారు. అనంతరం బెయిల్ మీద విడుదలయ్యారు. తన మీద దాడి చేశారంటూ వెంకటాచలం ఎంపీడీఓ సరళ కోటంరెడ్డి మీద ఫిర్యాదు చేయడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తన మీద ఎంపీడీఓ సరళ కేసు పెట్టడం వెనుక సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి హస్తం ఉందని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ సరళ కేసు పెట్టడానికి వెళ్లినప్పుడు అక్కడకు కాకాణి అనుచరులు వచ్చి.. పోలీసులను దుర్భాషలాడారని కోటంరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేశారు. దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కోటంరెడ్డి కోరుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓ సరళకు ఫోన్ చేసి విషయం అడిగితే.. ‘మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నాడు.’ అని చెప్పినట్టు కోటంరెడ్డి వెల్లడించారు. ఇదే విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కాకాణికి ఫోన్ చేస్తే.. ‘నీకు తెలీదు. నువ్వు ఊరుకో’ అని చెప్పినట్టు స్వయంగా శ్రీధర్ రెడ్డి మీడియాకు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళా అధికారి బాధితురాలిగా మారారు. ఎమ్మెల్యేల వర్గ పోరు వ్యవహారం సీఎం జగన్ మోహన్ రెడ్డి వద్దకు చేరింది. ఈ విషయంపై నేడు నేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
తమన్నాకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 9, 2019, 5:33 AM IST