ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుదుత్పత్తిపై ( Power Crisis)ఇటీవల అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కరిగిపోతుండటంతో ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడింది. ఇప్పటికే పరిశ్రమలు విద్యుత్ సరఫరాకు పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. . దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. కావాల్సిన బొగ్గు కొనుగోలుచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టంచేసిన సీఎం.., ఇప్పుడున్న ధర్మల్‌కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు.
కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని.., తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి సంస్థతో కూడా సమన్వయంచేసుకుని అవసరాలమేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం జగన్ అన్నారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రఘురామ ఫైర్...
ఇదిలా ఉంటే రాష్ట్రంలో విద్యుత్ కొరతపై వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnama Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ సమస్యపై కోల్ ఇండియా ఛైర్మన్ తో చర్చించానని.. రాష్ట్రాలు బొగ్గునిల్వలు పెంచుకునేందుకు యత్నించాలని సూచించారని చెప్పారు. అలాగే కోల్ ఇండియాకు ఏపీ ప్రభుత్వం రూ.300 కోట్లు బాకీ ఉందన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలపై జగనన్నవి కొవ్వొత్తి, అగ్గెపట్టె పథకాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ వైఫల్యమే: టీడీపీ
ఇదే అంశంపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కూడా మండిపడింది. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రులుడు విమర్శించారు. విద్యుత్ కొనుగోలు ధర 3 రూపాయల పన్నెండు పైసలు ఉంటే, జగన్ రెడ్డి మాత్రం తన కమీషన్ల కోసం 6 రూపాయల నుండి 11 రూపాయల వరకు కొంటున్నారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని మళ్లీ ప్రజలపైనే వేస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. పాదయాత్రలో నేను ముఖ్యమంత్రి అయితే 200 యూనిట్లు వరకు కరెంట్ ఉచితంగా ఇస్తాను చెప్పి, మాట తప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు పెంచనని ప్రచారం చేసుకొని తీరా గెలిచాక ఈ రెండున్నరేళ్లలో ప్రజలపై రూ. 37 వేల కోట్ల భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు.
జగనన్న చీకటి పథకం: సీపీఐ
ఇక రాష్ట్రంలో జగనన్న చీకటి పథకానికి శ్రీకారం చుట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు, డిస్కంల ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని రామకృష్ణ మండిపడ్డారు. కరెంట్ బిల్ తగ్గాలంటే లైట్లు, ఏసీలు ఆపమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గెలుపును ఆపేయడం ఖాయమన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, CPI, MP raghurama krishnam raju, TDP