• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP CM YS JAGAN MOHAN REDDY GOVERNMENT SENSATIONAL DECISION ON EBC KAPU RESERVATION BA

కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ లేదు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాపులకు ప్రత్యేక రిజర్వేషన్ లేదు.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)

YS Jaganmohan Reddy | జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రం తెచ్చిన 10 శాతం ఈబీసీ కోటాలో కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండదు. ఆర్థికంగా వెనుకబడిన కాపులకు మాత్రం రిజర్వేషన్ వర్తిస్తుంది.

  • Share this:
    ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్ధల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఈ కోటాలో భాగంగా ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్ల అమలు నిలిపోయినట్లయింది. దీనికి బదులుగా ఓసీ జాబితాలో ఉన్న ఆర్ధికంగా వెనుకబడిన కాపులకు మాత్రం పదిశాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం కోటా కల్పిస్తూ గతంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇప్పటివరకూ ఏ రిజర్వేషన్ల పరిధిలోకి రాకుండా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. దీంతో పాటు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారు, వెయ్యి చదరపు అడుగుల స్ధలంలో ఇల్లు లేదా పట్టణ ప్రాంతాల్లో 100చదరపు గజాల స్ధలం, గ్రామీణ ప్రాంతాల్లో 200 గజాల ఇంటి స్ధలం కలిగిన వారిని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు. ఆయా నిబంధనల ప్రకారం విద్యాసంస్ధల్లో ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో జారీ చేసింది.

    వాస్తవానికి గతంలో మోదీ సర్కారు విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేసింది..ఆ చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 10 శాతం పెంచి అందులో ఆర్ధికంగా వెనకబడ్డ వారికి కేటాయించాల్సి ఉంటుంది. అయితే గతంలో చంద్రబాబు సర్కారు ఈ 10 శాతంలో 5 శాతం కాపులకు ఇచ్చింది. అప్పటికే ఐదుశాతం కాపు రిజర్వేషన్లను కేంద్రం తోసిపుచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అమల్లోకి రాలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈబీసీ కోటాలో కాపులకు ఐదుశాతం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు... కేంద్రం చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యామండలి సూచనతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇప్పటికే సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లను పెంచి రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. ప్రభుత్వ జీవోతో దీని అమలుకు మార్గం సుగమమైంది.

    కేంద్రం తీసుకొచ్చిన పదిశాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదలకు భారీగా లబ్ది చేకూరనుంది. అయితే ఆర్ధిక పరిస్ధితి ఆధారంగా కాకుండా కాపులకు ఏకరీతిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడం రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ముస్లిం రిజర్వేషన్ల విషయంలోనూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా బ్రేక్ పడింది. ఆ తర్వాత వాటిలో ఆర్ధికంగా వెనుకబడిన కొన్ని కులాలకు మాత్రమే 4 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇదే కోవలో కాపుల్లోనూ ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఈబీసీ కోటాలో 10 రిజర్వేషన్లు అమలయ్యే అవకాశముంది.

    (సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు