కేజ్రీవాల్ బాటలో జగన్... ఏపీలో విలేజ్ క్లినిక్స్

ఏపీలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సక్సెస్ ఫార్ములాను ఫాలో కావాలని డిసైడయిన జగన్... ఈ క్రమంలోనే విలేజ్ క్లినిక్స్ ప్లాన్ చేస్తున్నారు.

news18-telugu
Updated: February 25, 2020, 3:57 PM IST
కేజ్రీవాల్ బాటలో జగన్... ఏపీలో విలేజ్ క్లినిక్స్
వైఎస్ జగన్, కేజ్రీవాల్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఢిల్లీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన అంశాల్లో మొహల్లా క్లినిక్ లు కూడా ఒకటి. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడాది క్రితం ప్రారంభించిన మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడంతో దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపైనా కనిపించింది. ఇప్పుడు అదే కోవలో ఏపీలోనూ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ పేరుతో జగన్ సర్కారు వీటిని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎక్కడో జిల్లా కేంద్రాల్లోనో, మున్సిపాలిటీల్లోనో ఉండే ఆస్పత్రులకు వెళ్లాలంటేనే జనం భయపడుతున్న పరిస్ధితుల్లో స్ధానికంగా ప్రాథమిక వైద్య సదుపాయాలు అందించాలంటే చాలా కష్టం. అయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతీ నియోజకవర్గంలోనూ స్ధానికంగా ఉండే జనాబా ఆధారంగా మొహల్లా క్లినిక్‌ల పేరుతో వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడంతో మొన్నటి ఎన్నికల్లోనూ వాటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అదే కోవలో ఏపీలోనూ వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిన్న విజయనగరం జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం సందర్బంగా సీఎం జగన్ విలేజ్ క్లినిక్‌లను త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతీ గ్రామ సచివాలయం ఉన్న చోట ఓ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రతీ క్లినిక్‌లో ఓ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఓ ఏఎన్ఎంను అందుబాటులో ఉంచనున్నారు. గ్రామ వాలంటీర్ల తరహాలోనే వీరినీ స్ధానిక గ్రామాల నుంచే ఎంపిక చేయనున్నారు. వీరిద్దరూ 24 గంటలూ సదరు గ్రామంలోని జనానికి అందుబాటులో ఉండేలా నిబంధన పెట్టనున్నారు. అవసరమైతే వీరికి ప్రభుత్వం తరఫున గ్రామంలో వసతి కల్పించేందుకు ఉన్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ క్లినిక్స్ ను ప్రారంభించాలని భావిస్తున్న జగన్ సర్కారు ఈ ఏడాది బడ్జెట్ లోనే దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.

సయ్యద్ అహ్మద్, న్యూస్18 ప్రతినిధి, అమరావతి
First published: February 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు