ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరోసారి పదవుల పందేరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే నామినేటెడ్ ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్లలో నామినేటెడ్ పదవుల ద్వారా వేలాది మందికి పదవులిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy).. తాజాగా మరికొన్ని కీలక పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అవే ఎమ్మెల్సీ పదవులు. ఏపీ శాసన మండలిలో 14 ఎమ్మెల్సీ స్థానల భర్తీకి సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. వీటిలో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎమ్మెల్యే కోటా నుంచి ఎంపిక కానున్నారు. గత ఆరు నెలలుగా ఈస్థానాలు ఖాళీగా ఉంటున్నాయి. స్థానిక సంస్థ కోటాటు కోర్టు అడ్డంకులతో పాటు పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా రాకపోవడంతో సదరు ఎన్నికలు ముడిపడటం లేదు. ఇటీవల పరిషత్ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో స్థానిక కోటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లైంది.
ప్రస్తుతం శాసనమండలిలో 58స్థానాలు ఉన్నాయి. వాటిలో వైసీపీకి 18 స్థానాలున్నాయి. ఖాళీగా ఉన్న 14స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశాలున్నాయి. దీంతో మండలిలో ఆ పార్టీ బలం పెరగనుంది. దీంతో మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు కూడా అధికార పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది తాడేపల్లిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండనున్న నేపథ్యంలో సీఎం వైఎశ్ జగన్ కూడా ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి నేతలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యంగా మర్రి రాజశేఖర్ (చిలకూలురుపేట, గుంటూరు జిల్లా), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు జిల్లా), బీద మస్తాన్ రావు (నెల్లూరు జిల్లా ), భరత్ (కుప్పం,చిత్తూరు జిల్లా), వరుదు కళ్యాణి (విశాఖపట్నం జిల్లా), యార్లగడ్డ వెంకట రావు (కృష్ణ జిల్లా), హరిప్రసాద్ రెడ్డి (చిత్తూరు జిల్లా), వై లక్ష్మీదేవి (ఉరవకొండ,అనంతపురం జిల్లా), ఆమంచి కృష్ణమోహన్ (చీరాల,ప్రకాశం జిల్లా) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరిలో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తామని గతంలోనే సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన్ను కేబినెట్లోకి తీసుకునేందుకు ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ సీనియర్ నేత, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు దుట్టా రామచంద్రరావు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం యత్నిస్తున్నారు. తన కుమార్తెకు కృష్ణాజెడ్పీ ఛైర్ పర్సన్ పదవిని ఆశించిన ఆయన.. అది కుదరకపోవడంతో ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని జగన్ ను కోరుతున్నట్లు సమాచారం.
బద్వేలు ఉపఎన్నిక అనంతరం ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ముహూర్తం పెట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే కేబినెట్లో మార్పులు చేయనున్నారు. దసరాకే చేపట్టాలని సీఎం జగన్ భావించినా.. బద్వేలు ఉపఎన్నిక, ఎమ్మెల్సీ స్థానాలు భర్తీకావలసి ఉండటంతో వాయిదా వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap mlc elections, Ysrcp