YSR Jayanthi: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి (YSR Birth Anniversary) వేడుకలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. తన తండ్రి గురించి వివరిస్తూ.. భావోద్వేగపు ట్వీట్ చేశారు. “చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం నీ ఆశయాలే నాకు వారసత్వం ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా... పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం జగన్ కు తన తండ్రి అంటే ఎంత ప్రేమో అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించనున్నారు. గురువారం ఉదయం అనంతపురం జిల్లా రాయదుర్గం వెళ్లిన ఆయన.. అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి కడప జిల్లా వెళ్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం సాయంత్రం ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు.
మరోవైపు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పించారు. ఉదయం వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అదే సమయంలో వైఎస్ షర్మిల స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన జెండాను వైఎస్ సమాధి వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి.. వైఎస్ భారతి నివాళులర్పించారు.
ఇక తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ కు నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని.. వైఎస్ వారసత్వాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని సజ్జల అన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు సజ్జల తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జయంతి వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొని నివాళులర్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.