• Home
  • »
  • News
  • »
  • politics
  • »
  • AP CM YS JAGAN MAY APPOINT IQBAL HAS LEGISLATIVE COUNCIL CHAIRMAN AND JANGA KRISHNAMURTHY AS DEPUTY CHAIRMAN GNT SK

Andhra Pradesh: ఏపీ శాసనమండలి కొత్త ఛైర్మన్ ఆయనేనా? టీడీపీ బాటలోనే వైసీపీ

సీఎం జగన్

మండలి ఛైర్మన్ విషయంలో టీడీపీ బాటలోనే వెళ్లేందుకే జగన్ మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు ముస్లిం మైనారిటీ నేత షరీఫ్ పదవిలో ఉండగా... ఆయన స్థానంలో మళ్లీ ముస్లిం మైనారిటీ నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    (అన్నా రఘు, న్యూస్ 18 ప్రతినిధి, గుంటూరు)

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్‌ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అధికారికంగా ప్రకటించటమే తరువాయని ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా షరీఫ్ వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మండలిలో తగిన బలం లేకపోవటంతో రాజధానుల వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఏ  బిల్లు రద్దు విషయంలో ప్రభుత్వం ఎన్నో ఇబ్బంది పడింది. అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. అప్పటి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా మండలి రద్దుకు తీర్మానం కూడా చేశారు. కానీ ఆ తర్వాత వెనకడుగు వేశారు. మండలిలో వైసీపీ సభ్యుల పెరగడంతో పాటు కొందరికి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉండడంతో.. మండలిని కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

    ఐతే మండలి ఛైర్మన్‌గా షరీఫ్ పదవీకాలం ముగిసింది. ఇటీవలే ఆయనకు వీడ్కోలు పలికారు. మరి ఇప్పుడు కొత్త ఛైర్మన్ ఎవరన్న దానిపైనే చర్చ జరుగుతోంది. ఛైర్మన్ ఎంపికకు సంబంధించి వైఎస్ జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ బాటలో వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొన్నటి వరకు ముస్లిం మైనారిటీ నేత షరీఫ్ ఆ పదవిలో ఉన్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు మళ్లీ ముస్లిం మైనారిటీ నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. హిందూపురం నేత, మాజీ ఐపీఎస్ అధికారి, చంద్రబాబుకు భద్రతా అధికారిగా పని చేసిన ఇక్బాల్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    2019 ఎన్నికల్లో ఇక్బాల్ వైసీపీ పార్టీ హిందూపుర్ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన బాలక్రిష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ మధ్యనే మరోసారి ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయించారు. 2027 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉండనున్నారు. ఇప్పటి వరకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న రెడ్డి సుబ్రమణ్యం సైతం టీడీపీ నుండే ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 18వ తేదీతో ముగియనుండటంతో  డిప్యూటీ ఛైర్మన్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా క్రిష్ణమూర్తికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

    షరీఫ్‌తో పాటుగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన డీసీ గోవిందరెడ్డి పదవీ విరమణ చేసారు. ఈ స్థానాలకు కరోనా తగ్గిన తరువాత మాత్రమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మూడింటితో పాటు ఈ నెల 18న స్థానిక సంస్థల కోటాలో మరో ఎనిమిది స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏడు టీడీపీకి కాగా..వైసీపీ నుండి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు..వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో పెద్దల సభలో టీడీపీ సంఖ్యా బలం మొత్తం 58 స్థానాలకు గాను..15 మందికే పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో సైతం వైసీపీకి పూర్తి ఆధిపత్యం దక్కనుంది. 
    Published by:Shiva Kumar Addula
    First published: