ఐదుగురు మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్... రాజధాని, బదిలీల్లో పైరవీలే కారణం

Andhra Pradesh : ఏపీలో అవినీతి లేని పాలన అందిస్తామని పదేపదే చెబుతున్న సీఎం జగన్... ఈ దిశగా పనిచేయని మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రికీ, ఉద్యోగుల బదిలీల్లో పైరవీలను ప్రోత్సహించారంటూ మరో నలుగురు జూనియర్ మంత్రులకు సీఎం జగన్ తనదైన శైలిలో హెచ్చరించినట్లు తెలిసింది. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదనేది ఆ హెచ్చరికల సారాంశం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 7, 2019, 12:55 PM IST
ఐదుగురు మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్... రాజధాని, బదిలీల్లో పైరవీలే కారణం
వైఎస్ జగన్ (File)
  • Share this:
ఏపీలో పాలనపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... ముందుగా తన ఇంటిని చక్కదిద్దుకునేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. తన కేబినెట్‌లో మంత్రులపై అవినీతి ముద్ర లేకుండా ఆయన నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. కేబినెట్ మంత్రుల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్స్‌తోపాటూ... సొంత రిపోర్టుల్ని కూడా తెప్పించుకుంటున్న జగన్... ఆ మేరకు వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా CRDAపై సమీక్ష సందర్భంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రికి జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం లైట్ తీసుకుంటున్న రాజధాని వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపైనే ఆ సీనియర్ మంత్రికి జగన్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇంటిలిజెన్స్ రిపోర్టుతోపాటు తన సొంత రిపోర్టు వివరాల్ని కూడా మంత్రికి చూపించిన జగన్... అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు సమాచారం.

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యోగుల బదిలీల్లో భారీ ఎత్తున పైరవీలు సాగుతున్నట్లు సీఎం జగన్‌కు సమాచారం అందింది. వారం నుంచీ సచివాలయంలోని మంత్రుల పేషీలు పైరవీకారులతో నిండిపోతున్నాయని న్యూస్ 18 ప్రత్యేక కథనాన్ని కూడా ఇచ్చింది. దీనిపై స్పందించిన జగన్ ఇంటిలిజెన్స్‌తోపాటు సొంత రిపోర్టుల్ని కూడా తెప్పించుకున్నారు. వీటి ఆధారంగా నలుగురు జూనియర్ మంత్రులు భారీగా పైరవీలను ప్రోత్సహించారనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. వారితో నేరుగా మాట్లాడిన జగన్... తీరు మార్చుకోకపోతే వేటు తప్పదనే హెచ్చరికలు చేశారు. అవినీతిరహిత ప్రభుత్వం కోసం తాను సీరియస్‌గా ప్రయత్నిస్తుంటే పైరవీలను ప్రోత్సహించడం ఏంటని మంత్రుల్ని జగన్ నిలదీశారు. అవినీతి మరకలు అంటుకుంటే వేటు తప్పదని తొలి కేబినెట్ భేటీలోనే తాను హెచ్చరించిన విషయాన్ని జగన్ మరోసారి గుర్తుచేశారు. దీంతో ఇకపై వాటికి దూరంగా ఉంటామని మంత్రులు సీఎంకు చెప్పినట్లు తెలిసింది.

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు దాటింది. ఇంకా సచివాలయంలో మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోలేదు. అంతలోనే బదిలీల పర్వం ప్రారంభం కావడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నుంచి తమపై ఒత్తిడి ఎక్కువగా ఉందని కొంతమంది మంత్రులు చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేల సూచనలతో కొన్నిసార్లు పైరవీలను ప్రోత్సహించాల్సిన పరిస్ధితులు ఉంటాయని మంత్రులు ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన బదిలీల పొడిగింపు గడువు ఈ నెల 10తో ముగియనుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. దీంతో తిరిగి వారు బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

(సయ్యద్ అహ్మద్ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)

First published: July 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...