AP CM JAGAN TO GO TO DELHI TODAY TO MEET PRIME MINISTER NARENDRA MODI HERE IS THE REASON NGS
Andhra Pradesh: అయిననూ హస్తినకు పోయి రావలె.. నేడు ఢిల్లీకి సీఎం జగన్
వైఎస్ జగన్, ప్రధాని మోదీ (File photo)
సీఎం జగన్ మరోసారి హస్తిన బాట పట్టారు. అయితే ఇటీవల అమిత్ షాను కలిసిన జగన్.. మళ్లీ ఎందుకు వెళ్తున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టమైన హామీ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.
ఏపీ సీఎం జగన్ మరోసారి హస్తిన వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నేతలు కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన నేడు ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. ఈ నెల 4న అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అనుకోకుండా కొన్నికారణాలవల్ల ఆ సమావేశం వాయిదా పడింది. ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాను కలిసి విన్నవించుకోవాలని సీఎం జగన్ భావించారు. కానీ అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఏపీ సీఎంవో కోరినట్లు తెలుస్తోంది.
గత జనవరిలో హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. అప్పటి హస్తిన పర్యటనలో ఇరువురి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ఆలయాలపై దాడులు, జమిలీ ఎన్నికలు తదితర అంశాలను చర్చించినట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలిసింది. సడెన్ గా ఇప్పుడు సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళుతుండడం వెనక... కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఎజెండాతోనే వెళుతున్నారా లేక రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం జగన్ వెళ్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా విశాఖ గ్రేటర్ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత కూడా విశాఖలో విజయం సాధించకపోతే అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అందులోనూ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడి వ్యవహారాలను స్వయంగా చూస్తున్నారు. అయితే అక్కడ కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం కనిపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఈ విషయంపైనే చర్చజరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం.. లేదా వాయిదా వేసేలా చూడాలిన జగన్ కోరే అవకాశం ఉంది. దీనికి తోడు పోస్కోను రాష్ట్రానికి రావాలి అంటూ ఏపీ ప్రభుత్వం ఆహ్వానించి్ంది. ఈ విషయంపై కేంద్రంతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పోలవరం ఎత్తు తగ్గించడం కుదరదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే పోలవరానికి రావాల్సిన నిధులు విడుదలపైనే ప్రధాని మోదీ, అమిత్ షాలను కోరే అవకాశం ఉంది.
వీటితో పాటు ఏపీ విభజన హామీలు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశం.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్నింటిపైనా స్పష్టంమైన హామీ తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు.. వీటితోపాటు ప్రత్యేక రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.