అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై... జగన్ కీలక నిర్ణయం

అదే సమయంలో అమరావతిలో సుప్రీంకోర్టు జడ్జిలకు సైతం భూములున్నాయంటూ నిన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం చేసిన ఆరోపణలు కూడా సంచలనం రేపాయి.

news18-telugu
Updated: February 3, 2020, 1:21 PM IST
అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై... జగన్ కీలక నిర్ణయం
సీఎం జగన్, అమరావతి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఏపీలో అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారం అతి త్వరలో కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ సీఐడీ విచారణ మాత్రమే చేపట్టగా తాజాగా ఈడీ జోక్యం కోరుతూ జగన్ సర్కార్ లేఖ రాయడం కలకలం రేపుతోంది. అదే సమయంలో చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలో నిన్న వైసీపీ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన సభలోనూ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం అమరావతి భూములపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అమరావతిలో భూముల దందాపై వైసీపీ ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టినట్లే కనిపిస్తోంది. రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో జరిగిన భూముల క్రయ విక్రయాలపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుపుతున్న ప్రభుత్వం మరింత లోతైన దర్యాప్తు కోసం ఓ స్వతంత్ర సంస్ధతో విచారణ చేయిస్తామని అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించింది.

తొలుత లోకాయుక్త విచారణ చేయించాలని భావించినా చివరకు ఈడీ దర్యాప్తు చేయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఈడీ దర్యాప్తు కోరుతూ సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ లేఖ రాసినట్లు తెలిసింది. బినామీల పేరుతో కోట్లాది రూపాయల విలువైన భూములను కొల్లగొట్టిన ఆరోపణలు రావడంతో ఆర్ధిక అక్రమాల కోణంలో దర్యాప్తు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈడీ దర్యాప్తు కోరినట్లు తెలుస్తోంది. ఈడీ రంగంలోకి దిగితే ఈ వ్యవహారంలో పలువురు పెద్ద తలకాయల పేర్లు బయటికొచ్చే అవకాశముంది.అదే సమయంలో అమరావతిలో సుప్రీంకోర్టు జడ్జిలకు సైతం భూములున్నాయంటూ నిన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం చేసిన ఆరోపణలు కూడా సంచలనం రేపాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక వివరాలు సేకరించినట్లు అర్ధమవుతోంది.

ప్రభుత్వ ముఖ్య సలహాదారు హోదాలో ఉన్న అజయ్ కల్లం వంటి వ్యక్తి చేసిన ఆరోపణలు కేవలం యథాలాపంగా చేసినవి కాదనే వాదన వినిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలను పలు కోణాల్లో బయటపెట్టేందుకు సిద్దమైనట్లు అర్దమవుతోంది. రాజకీయంగా తమకు నష్టం కలగని రీతిలో అమరావతి భూముల దందా వ్యవహారాన్ని బయటపెట్టాలనే ఉద్దేశం ఉన్నందువల్లే విడతల వారీగా లీకులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని సాంకేతికంగా నిరూపించాలంటే మాత్రం దర్యాప్తు సంస్ధలకు కూడా అంత సులువు కాదు. కాబట్టి అమరావతి వ్యవహారాన్ని సాధ్యమైనంత కాలం సాగదీయడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించవచ్చన్న వాదన కూడా ఉంది.

First published: February 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు