ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకుంటున్న నిర్ణయాలు ఇటీవలే అనేక రాజకీయ వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ శీతకాల సమావేశాలకు హాజరైన వల్లభనేని మొదటిరోజు టీడీపీ గ్రూపులోనే కూర్చొన్నారు.రెండో రోజు మాత్రం సభలో వల్లభనేని వంశీ మాట్లాడారు. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి వేరే చోట సీటు కేటాయించాలంటూ స్పీకర్ తమ్మినేనికి విజ్ఞప్తి చేశారు. దానికి స్పీకర్ కూడా ఒకే అన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం మీకు ఏదో ఓ చోట సీటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వంశీ సభ సాక్షిగా తనను ప్రత్యేక సభ్యుడిగా ప్రకటించిన వ్యాఖ్యల వెనుక జగన్ రాజకీయం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అధికారం చేజెక్కించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి పార్టీ ఫిరాయింపులకు తాను దూరమనే జగన్ చెప్తూ వచ్చారు. ఒకవేళ పదవిలో ఉన్నవారు ఎవరైనా సరే తన పార్టీలో చేరాలంటే.. ఆ పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుందని కండిషన్ పెట్టారు. అందుకే ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతిపక్ష పార్టీ నేతలు ఏ ఒక్కరు కూడా పార్టీల్లో ఎలాంటి సమస్యలు వచ్చి జగన్‌ను కలిసినా.. వైసీపీలో మాత్రం చేర్పించుకోలేదు. వంశీ విషయంలో కూడా జగన్ ఇదే సిస్టమ్ ఫాలో అయ్యారు.అయితే వంశీని తటస్థ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంతో... టీడీపీలో పార్టీ మారాలనుకుంటున్న సభ్యులకు జగన్ ఓ మెసేజ్ ఇచ్చినట్లు అయ్యింది. వంశీని గుర్తించినట్లుగానే టిడిపి నుంచి వచ్చే మరికొందరు ఎమ్మెల్యేలను తటస్థులుగా గుర్తిస్తామన్న సంకేతాన్ని స్పీకర్ ద్వారా పంపించేసింది వైసీపీ.
అయితే వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ పారిన ఎమ్మెల్యేలకు మంచి ఛాన్స్ దొరికింది. గెలిచిన పార్టీని వీడినా అనర్హత వేటు పడనప్పుడు తటస్థులుగా కొనసాగుతూ అధికార పార్టీతో లోపాయికారిగా కలిసి వుండడం బెటరన్నది తాజా మెసేజ్. ఈరకంగా వ్యవహరిస్తే.. పదవికి వచ్చిన ప్రమాదం లేదు.. అదే సమయంలో అధికారపార్టీతోను, ప్రభుత్వంతోను చేయించుకోవాల్సిన ప్రయోజనాలు ఎంచక్కా చక్కబెట్టుకోవచ్చు. దీంతో పాటు... అటు టీడీపీని కూడా దెబ్బ కొట్టవచ్చేనది జగన్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఇప్పటికే టిడిపిలో 22 మంది ఎమ్మెల్యేలు మిగిలున్నారు. వీరిలో ఆరు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను లాగేస్తే.. ఏపీలో తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడడంతోపాటు.. చంద్రబాబుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా దూరమవుతుంది. ఫలితంగా ఆయనతోపాటు తెలుగుదేశం పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతినడం జరుగుతుందన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి జగన్ ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.