Home /News /politics /

మంగళగిరికి ఏపీ సచివాలయం... సీఎం జగన్ మదిలో కొత్త ఆలోచన

మంగళగిరికి ఏపీ సచివాలయం... సీఎం జగన్ మదిలో కొత్త ఆలోచన

వైఎస్. జగన్, ఏపీ అసెంబ్లీ, ఏపీ సెక్రటేరియట్ (ఫైల్ చిత్రం)

వైఎస్. జగన్, ఏపీ అసెంబ్లీ, ఏపీ సెక్రటేరియట్ (ఫైల్ చిత్రం)

ఇప్పటికే అమరావతిలో రాజధాని కొనసాగింపుపై తీవ్ర అనాసక్తిగా ఉన్న ప్రభుత్వం వీటిని సీరియస్ గా పరిశీలనకు కూడా తీసుకుని తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

  విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తుడిచిపెట్టాలని భావిస్తున్న వైసీపీ సర్కారు.. త్వరలో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయాన్ని మంగళగిరికి మార్చబోతోందా ? ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ ల ద్వారా ఈ మేరకు ప్రతిపాదనలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిందా ? ఈ ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరునెలల్లో సచివాలయం మంగళగిరిలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి లేదా కాజా టోల్ గేట్ కు సమీపంలో నిర్మిస్తున్న ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి మారనున్నట్లు తెలుస్తోంది.

  ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన గత టీడీపీ ప్రభుత్వం... అందుకు తగిన మౌలిక సౌకర్యాల కల్పనలో మాత్రం ఘోరంగా విఫలమైంది. విజయవాడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా దాదాపు 12 కిలోమీటర్ల ప్రయాణంతో మందడం గ్రామం మీదుగా వెలగపూడి సచివాలయానికి చేరుకునేలా చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో రహదారిని నిర్మించింది. అటు గుంటూరు నుంచి కూడా మంగళగిరి మీదుగా సచివాలయానికి వెళ్లేలా రూటు ఇచ్చారు. ఇలా ఏ విధంగా చూసినా సచివాలయానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనూ అధికారులు, ఉద్యోగులు, కిందిస్ధాయి సిబ్బంది సైతం నివాసానికి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. సమీపంలో ఉన్న మందడం గ్రామంలో మినహా సచివాలయం చుట్టుపక్కల కనీసం బడ్డీ కొట్లు కూడా లేని దుస్ధితి. దీంతో వివిధ పనుల మీద నిత్యం సచివాలయానికి వచ్చే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగులకూ కిలోమీటర్ల దూరం ప్రయాణించక తప్పని పరిస్ధితి నెలకొంటోంది.

  ఇలాంటి పరిస్ధితుల్లో సచివాలయాన్ని జనసంచారం ఎక్కువగా ఉండే మంగళగిరికి సమీపంలోని ఏదో ఒక ప్రాంతానికి మార్చాలని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇప్పటికే అమరావతిలో రాజధాని కొనసాగింపుపై తీవ్ర అనాసక్తిగా ఉన్న ప్రభుత్వం వీటిని సీరియస్ గా పరిశీలనకు కూడా తీసుకుని తదుపరి చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగో కృష్ణానది ముంపు ప్రాంతంలో రాజధాని సురక్షితం కాదంటూ ఇప్పటికే పలువురు మంత్రులు కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఓ మంచి ముహుర్తం చూసుకుని సచివాలయాన్ని మంగళగిరికి సమీపంలో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అది కుదరకపోతే కాజా టోల్ గేట్ ఆవల నిర్మాణంలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీకి మారిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాబోయే ఆరునెలల్లో దీనిపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు మార్పు కూడా ఉండేలా కసరత్తు జరుగుతోంది. సచివాలయం మారినా శాసనసభ, శాసనమండలి ప్రాంగణం మాత్రం వెలగపూడిలోనే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  వెలగపూడిలో గత ప్రభుత్వం హడావిడిగా నిర్మించిన సచివాలయం, అసెంబ్లీ తదితర నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. కృష్ణానదితో పోల్చినా, ప్రకాశం బ్యారేజ్ తో పోల్చినా వాస్తు రీత్యా కూడా సచివాలయం ఉన్న ప్రాంతం సరైనది కాదని ప్రభుత్వ పెద్దలు కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సచివాలయంలోని సీఎం ఛాంబర్ సహా పలు నిర్మాణాల్లో వాస్తు రీత్యా మార్పులు కూడా జరిగాయి. అయినా వీటిపై జగన్ ప్రభుత్వం సంతృప్తి ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో సచివాలయం మార్పు ప్రతిపాదనకు సీఎం జగన్ తుది ఆమోదం ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
  (సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)

  ఇవికూడా చూడండి:

  ఏపీ హైకోర్టు చీఫ్ జస్టీస్‌గా జితేంద్ర కుమార్ మహేశ్వరి

  First published:

  Tags: Andhra Pradesh, Andhrapradesh secretariat, Ap cm jagan, Ap government, AP News, AP Politics, Mangalagiri

  తదుపరి వార్తలు