Home /News /politics /

పోలవరం రివర్స్ టెండరింగ్‌లో జగన్ సక్సెస్ అయినట్లేనా ?

పోలవరం రివర్స్ టెండరింగ్‌లో జగన్ సక్సెస్ అయినట్లేనా ?

జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)

జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)

చంద్రబాబు అయితే పోలవరంలో తనకు నచ్చిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించేందుకే ఈ ప్రక్రియ చేపట్టారని నిన్న దుమ్మెత్తిపోశారు. కానీ జగన్ సర్కారు ఈ వాదనలన్నీ ఒట్టి అసత్యాలే అని నిరూపించింది.

  "రివర్స్ టెండరింగ్"... ఈ పేరు చెబితే ఏపీలో ప్రతిపక్షాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న మొన్నటి వరకూ నిప్పులు చెరిగాయి. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేపడితే ప్రాజెక‌్టు వ్యయం భారీగా పెరిగిపోవడంతో పాటు నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియనంత ఆలస్యమవుతుందంటూ ఏకంగా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కూడా తేల్చేశారు. పోలవరం ప్రాజెక్టు అధారిటీ అయితే రివర్స్ టెండరింగ్ ఏమాత్రం సమంజసం కాదని కుండబద్దలు కొట్టింది. చంద్రబాబు అయితే పోలవరంలో తనకు నచ్చిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించేందుకే ఈ ప్రక్రియ చేపట్టారని నిన్న దుమ్మెత్తిపోశారు. కానీ జగన్ సర్కారు ఈ వాదనలన్నీ ఒట్టి అసత్యాలే అని నిరూపించింది.

  పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తొలి అడుగు ఘనంగా వేసింది. 65వ నంబరు ప్యాకేజీ పనుల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ లో ఏకంగా 58.53 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆదా చేయడమే కాకుండా గతంలో పనులు తీసుకున్న కాంట్రాక్టర్ కే పనులు అప్పగించడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. అంటే కాంట్రాక్టు సంస్ధ మ్యాక్స్ ఇన్ ఫ్రా మెడలు వంచి అదే పనిని వారికే అప్పగించడంతో పాటు కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కాపాడగలిగింది. కేవలం ఒక్క ప్యాకేజీలోనే దాదాపు 60 కోట్ల రూపాయలు మిగిలితే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో వందల కోట్ల రూపాయలు మిగిల్చేందుకు అవకాశం ఉందని నిన్నటి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా స్పష్టంగా చెప్పినట్లయింది. ఇప్పుడు పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనుల్లో ఇదే రివర్స్ టెండరింగ్ అమలయితే ఎన్ని కోట్లు మిగులుతాయో అని నిపుణులు సైతం ఎదురు చూడాల్సిన పరిస్ధితి.

  నిన్న విపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలను గమనించినా, గతంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ మాటలు పరిశీలించినా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ హెచ్చరికలను నిశితంగా చూసినా పోలవరంలో రివర్స్ టెండరింగ్ ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని అనిపించింది. కానీ తొలి అడుగులోనే జగన్ ప్రభుత్వం అన్ని అనుమానాలను పటాపంచలు చేసింది. పక్కా ప్రణాళిక, చిత్తశుద్ది ఉంటే ఎంతటి ఇబ్బందులైనా అధిగమించవచ్చని నిరూపించింది. నిన్నటి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఓసారి గమనిస్తే గతంలో నిర్ధారించిన 274 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని బిడ్డింగ్ సంస్ధల ముందుంచి తమ ధరలను కోట్ చేయాలని జలవనరుల శాఖ కోరింది. అంటే 274 కోట్ల రూపాయల కంటే తక్కువగా కోట్ చేసిన వారికి మాత్రమే పనులు అప్పగించడం జరుగుతుంది. ఇలాంటి దశలో గత కాంట్రాక్టరు మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్ధ 260 కోట్ల రూపాయలు కోట్ చేసింది. మిగతా ఐదు సంస్ధలు ఇంతకంటే ఎక్కువ ధరనే కోట్ చేశాయి. అయితే ఈ వివరాలను వెల్లడించకుండా మధ్యాహ్నం మరోసారి రివర్స్ ఆక్షన్ నిర్వహించిన అధికారులు... ఉదయం కంటే తక్కువకు కోట్ చేసేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని మరోసారి బిడ్డర్లను కోరారు. దీంతో వారు ఆలోచనలో పడ్డారు. చివరికి తొలుత 260 కోట్లకు పని పూర్తి చేస్తామన్న మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్ధ ఈసారి 231.47 కోట్లకు పూర్తి చేసేలా ముందుకొచ్చింది.

  దీంతో ఎల్1గా మ్యాక్స్ ఇన్ ఫ్రాను ఎంపిక చేసిన అధికారులు.. వారికే పనులు అప్పగించారు.
  తాజా ప్రక్రియతో రివర్స్ టెండరింగ్ లో ఏదో జరిగిపోతోందన్న అనుమానాలను, భయాలను నివృత్తి చేయడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం 65వ ప్యాకేజీలో భాగంగా ఎడమకాలువను ప్రధాన ప్రాజెక్టుతో అనుసంధానించే పనులు అప్పగించిన ప్రభుత్వం.. త్వరలో మిగతా పనులను కూడా ఇదే తరహాలో అప్పగించేందుకు సిద్దమవుతోంది. అయితే గతంలో పనులు తీసుకున్న సంస్ధ అంతకంటే తక్కువకు కోట్ చేసి మరీ పనులు దక్కించుకోవడం రికార్డుగా చెప్పవచ్చు.

  (సయ్యద్ అహ్మద్, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 18 తెలుగు)
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Polavaram

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు