AP CM CHANDRABABU INTERESTING COMMENTS ON MP AVANTI SRINIVAS JOINING YSRCP AK
అవంతి శ్రీనివాస్‌ను అలా బెదిరించారు... చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
అవంతి శ్రీనివాస్, చంద్రబాబు(ఫైల్ ఫోటోలు)
కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరినీ వైఎస్ జగన్ కాదనలేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇద్దరిలో ఎవరిని కాదన్నా... జగన్ వెంటనే జైలుకెళ్తారని అన్నారు. ఈ ముగ్గురి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు.
గురువారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గురించి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయని... ఈ కారణంగానే ఆయనను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారని చంద్రబాబు అన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ, టీఆర్ఎస్ హస్తం కూడా ఉందని ఆరోపించారు. మొన్నటివరకు ఢిల్లీలో తనతో కలిసి ఉన్న అవంతి శ్రీనివాస్... ఉన్నట్టుండి పార్టీ మారడాన్ని ఏమనాలని పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫిరెన్స్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరినీ వైఎస్ జగన్ కాదనలేరని చంద్రబాబు తెలిపారు. ఇద్దరిలో ఎవరిని కాదన్నా... జగన్ వెంటనే జైలుకెళ్తారని అన్నారు. ఈ ముగ్గురి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామన్న చంద్రబాబు... కేంద్రంతో చేసే యుద్ధంలో గెలుపే మన లక్ష్యం కావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనేది ఈ ముగ్గురు ఆలోచన అని చంద్రబాబు వివరించారు.
హైదరాబాద్‌ను మించి అమరావతి అభివృద్ధి చెందితే మనుగడ ఉండదనేది వారి భయమని తెలిపారు. స్థానిక పరిస్థితులు నేతలకు తెలుస్తుంటాయన్న టీడీపీ అధినేత... పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు ఎక్కడ జరుగుతున్నా చెప్పాలని సూచించారు. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులను ఆ వర్గం నేతలే ఖండించాలని అన్నారు. తమ కుటుంబానికి చెందిన పలువురు నేతలు ఇతర పార్టీల్లో ఉన్నారని చెప్పిన చంద్రబాబు... కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అనే విషయాన్ని నేతలు గుర్తించుకోవాలని సూచించారు.