సీఎం vs సీఎస్..! ఏపీలో నిన్నటి దాకా ఇదే గొడవ..! సీఎం చంద్రబాబు, సీఎం ఎల్వీ సుబ్రమణ్యం ఉప్పునిప్పులా ఉన్నారు. పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను వేడెక్కించారు. ఐతే మంగళవారం అమరావతిలో జరిగిన కేబినెట్ భేటీలో సీన్ మారిపోయింది. సీఎం, సీఎస్ కాస్త కలివిడిగా కనిపించారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ కెమెరా కంటపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో అందరి కళ్లు వీరిద్దరిపైనే ఉన్నాయి. సీఎం చంద్రబాబు పక్కన కూర్చున్న సీఎస్ సుబ్రమణ్యం ఆయనతో సరదాగా ముచ్చటించారు.
సీఎస్‌గా పునేఠను తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ముందునుంచీ ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు. జగన్ కేసుల్లో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలా సీఎస్‌గా నియమిస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యం వెళ్లడంపైనా సీఎం అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. సీఎం తీరుపై అభ్యంతరం వ్యక్తంచేసిన IAS అధికారుల సంఘం గవర్నర్‌కు కూడా ఫిర్యాదుచేసింది.
అటు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సైతం సీఎం పట్ల దూకుడుగానే వ్యవహరించారు. చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం అని..ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని బాహాటంగానే విమర్శించారు. మే 23 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నా 'అధికారాలు లేని సీఎం' అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఏపీలో పరిపాలనపై సమీక్షలకు సంబంధించి పర్యవేక్షణ అంతా ఈసీ, సీఎస్ పరిధిలోనే ఉంటుందని స్పష్టంచేశారు. ఆయన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అంతేకాదు కేబినెట్ భేటీ విషయంలోనూ చంద్రబాబుతో విభేదించారు ఎల్వీ సుబ్రమణ్యం. మంత్రివర్గ సమావేశం వాస్తవానికి ఈనెల 10నే జరగాల్సి ఉంది. కానీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అడ్డుచెప్పారు. భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అనుమతి తీసుకున్న తర్వాతే మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ భేటీ మే14కు వాయిదా పడింది. మొత్తంగా ఉప్పునిప్పులా ఉన్న సీఎస్-సీఎంలు..కేబినెట్లో కలివిడిగా కనిపించడం చర్చనీయాంశయమైంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.