Home /News /politics /

AP CID TO SUBMIT COUNTER AFFIDAVIT AT HIGH COURT IN AGRIGOLD HAILAND ASSETS CASE

హాయ్‌ల్యాండ్ వివాదం : ఇవాళ హైకోర్టులో సీఐడీ కౌంటర్ అఫిడవిట్

ప్రతీకాత్మక చిత్రం (ట్విట్టర్)

ప్రతీకాత్మక చిత్రం (ట్విట్టర్)

హాయ్‌ల్యాండ్‌పై అగ్రిగోల్డ్‌ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అది తమది కాదంటూ అగ్రిగోల్డ్ ఛైర్మన్, హాయ్‌ల్యాండ్ ఎండీతో ఇదివరకు జరిపిన ములాఖత్ తాజాగా బట్టబయలైంది. అప్రమత్తమైన సీఐడీ... వెంటనే హాయ్‌ల్యాండ్ ఎండీని అరెస్టు చేసింది. విచారణలో ఆయన వెల్లడించిన విషయాలతో ఇవాళ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యబోతోంది సీఐడీ.

ఇంకా చదవండి ...
    అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు ఎప్పుడు తీరతాయో తెలియకపోగా, ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం... హాయ్‌ల్యాండ్‌ ఎండీ వెంకటేశ్వరరావుతో ‘దొంగ’ అఫిడవిట్‌ దాఖలు చేయించినట్లు తాజాగా తెలిసింది. ఈ విషయాన్ని వెంకటేశ్వరరావే సీఐడీ ఎంక్వైరీలో ఒప్పుకున్నారని సమాచారం. హాయ్‌ల్యాండ్‌ విషయంలో సీఐడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాలతో హాయ్‌ల్యాండ్‌ను వేలంలో అమ్మితే, తక్కువ డబ్బులే వస్తాయనీ, అసలది ‘అగ్రిగోల్డ్‌’ ఆస్తికాదని చెబితే, దాని జోలికి అధికారులు రారనుకున్న, ఛైర్మన్‌ వెంకట రామారావు ఓ ప్లాన్ వేశారు. ఏలూరు జైల్లో ఉన్న ఆయన దగ్గరకు వెంకటేశ్వరరావును... అగ్రిగోల్డ్ సంస్థ టెక్నికల్‌ అడ్వైజర్‌ రవికాంత్‌ తీసుకెళ్లారు. అక్కడ వాళ్లిద్దరి మధ్యా జరిగిందో ఆసక్తికర చర్చ. హాయ్‌ల్యాండ్ తనది కాదని చెబుతానన్న వెంకట రామారావు, అది తనదేనని వెంకటేశ్వరరావును కోర్టులో పిటిషన్ వెయ్యమన్నారు. ఇందుకు వెంకటేశ్వరరావు సరేనన్నట్లు తెలిసింది. ఐతే, వెంకటేశ్వరరావు హాయ్‌ల్యాండ్‌లో ఉద్యోగి మాత్రమే. గుంటూరు జిల్లా, రేపల్లెకు చెందిన ఆయన, ఎండీ గా ఉంటూ నెలకు 70 వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు.

    ప్రజల నుంచీ వేల కోట్ల రూపాయల డిపాజిట్లు తీసుకున్న అగ్రిగోల్డ్, ఆ డబ్బుతో ఆస్తుల్ని కొంది. వాటి వివరాల్ని సేకరించిన సీఐడీ అధికారులు, అగ్రిగోల్డ్‌ చైర్మన్‌, డైరెక్టర్లు, వారి బినామీల ఆస్తుల్ని జప్తు చేశారు. వాటిలో విజయవాడ-గుంటూరు మధ్య, చినకాకాని దగ్గరున్న వందల కోట్ల రూపాయల విలువైన హాయ్‌ల్యాండ్‌ కూడా ఉంది. ఇది అర్కా లీజర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రిజిస్టర్‌ అయ్యింది. హాయ్‌ల్యాండ్‌, అగ్రిగోల్డ్‌ది కాదనీ, అర్కా సంస్థది అని, వెంకటేశ్వరరావు హైకోర్టులో అఫిడవిట్‌ వేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి... కొన్నాళ్లు తిరుపతిలో ఉన్నారు. తిరిగి సొంతూరు రేపల్లెకు వచ్చిన ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

    ఏపీ సీఐడీ చీఫ్‌ అమిత్‌ గార్గ్‌ ఎంక్వైరీలో వెంకటేశ్వరరావు, హాయ్‌ల్యాండ్, అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని చెప్పారు. నెలకు లక్ష రూపాయల జీతం కూడా లేని తనకు, వందల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వస్తాయని ఎదురు ప్రశ్నించారు. కోర్టులో ఆ అఫిడవిట్‌ ఎందుకు వేశారని అడగ్గా, ఏలూరు జైల్లో జరిగిన ములాఖత్‌ను బయటపెట్టారు. ఈ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసిన సీఐడీ, ఇవాళ హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ వెయ్యబోతోంది. ఫలితంగా హాయ్‌ల్యాండ్ ఆస్తుల్ని అమ్మి, బాధితులకు న్యాయం చేసేందుకు కొంతవరకూ అవకాశం ఏర్పడుతుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Agri Gold, Ap, Chandrababu naidu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు