news18-telugu
Updated: August 28, 2019, 1:37 PM IST
దొనకొండ (ప్రతీకాత్మక చిత్రం)
ఏపీ రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి తరలిస్తారనే ఊహాగానాలు గతకొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువుకాదని ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం రాజధానిని ప్రకాశం జిల్లా దొనకొండకు మారుస్తుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో రోజుల వ్యవధిలోనే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసరాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.
మరోవైపు ఏపీలో రాజధానిని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయకుండా... నాలుగు ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందనే వాదనలు కూడా వినిపించాయి. కేంద్ర పెద్దలతో సీఎం జగన్ దీనికి సంబంధించి చర్చలు కూడా జరిపారని ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైసీపీ ప్రభుత్వానికి అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచన లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
రాజధానిని మార్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందన్న ఎంపీ జీవీఎల్... ప్రకాశం జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేసే యోచనలో ఏపీ కొత్త ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానానికి దగ్గరగా ఉండే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న జీవీఎల్ నరసింహారావు చేసినట్టుగా ప్రచారంలో ఈ వ్యాఖ్యలను బట్టి... ప్రకాశం జిల్లా దొనకొండలో ఏపీ రాజధాని ఏర్పాటయ్యే అవకాశం ఉందని మరోసారి చర్చ మొదలైంది. మొత్తానికి ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు ? అమరావతి భవిష్యత్తు ఏమిటనే విషయంలో తెలియడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Published by:
Kishore Akkaladevi
First published:
August 28, 2019, 1:36 PM IST