Maha Padayatra Update: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఏకైక రాజధానిగా అమరావతి (Amaravati)ని కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ (Maha Padayatra) కాసేపట్లో ప్రారంభం కానుంది. అమరావతి రైతులు తమ గోడు వినిపించేందుకు తిరుమల వెంకటేశ్వర స్వామి (Tirumala venkateswaraswamy) దగ్గరకు వెళ్లనున్నారు. అమరావతి పోరులో భాగంగా పాదయాత్ర విజయవంతం కావాలని ఆదివారం తుళ్లూ రు రైతు దీక్షా శిబిరంలో రైతులు సర్వమత ప్రార్థనలు చేశారు. లక్ష్మీగణపతి, కాలబైరవ హోమం, నవగ్రహ హోమం నిర్వహించారు. తాళ్లాయపాలెం శైవక్షేత్రం నుంచి వచ్చిన రుత్వికులు హోమ క్రతువు నిర్వహించారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో చేపట్టే యాత్రకు అమరావతిలోని తుళ్లూరులో ఉదయం 9.05 గంటలకు శ్రీకారం చుడతారు. వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత ప్రతిమలకు పూజలు, సర్వమత ప్రార్థనల అనంతరం రాజధాని ఉద్యమ జెండా ఊపి యాత్ర బయలుదేరుతుంది. అంతకుముందు 9 మంది మహిళలు నేలపాడులోని హైకోర్టు (Highcourt)కు హారతిచ్చి.. అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యే ప్రదేశానికి చేరుకుంటారు. ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడం లక్ష్యంగా చేపడుతున్న పాదయాత్ర మొత్తం 45 రోజులపాటు కొనసాగుతుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే యాత్ర డిసెంబరు 17న తిరుపతి (Tirupati)లో ముగుస్తుంది. యాత్రలో పాల్గొనేవారి జాబితాను పోలీసులకు అందించినట్లు అమరావతి ఐకాస నేతలు చెప్పారు.
ప్రతి ఒక్కరికీ గుర్తింపుకార్డులు
తొలి రోజు యాత్రలో భాగంగా రైతులు పెదపరిమి వరకూ వెళ్లి అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. తరువాత ఏడు కిలోమీటర్ల దూరంలోని తాడికొండ వరకూ యాత్ర కొనసాగించి రాత్రి బస చేస్తారు. పాదయాత్ర కోసం అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రాజధాని ఐక్య సంఘాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ గుర్తింపుకార్డులు ఇచ్చారు. వాలంటీర్ల కోసం ప్రత్యేక టీషర్టులు రూపొందించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అమరావతి సాంస్కృతిక వేదిక బృందం యాత్ర వెంట ప్రత్యేక వాహనంలో వెళ్తుంది. పాదయాత్ర సజావుగా జరిగేలా 9 కమిటీలు ఏర్పాటు చేసి, బాధ్యుల్ని నియమించారు.
రాజధాని రైతుల మహా పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, అమరావతి బహుజన ఐక్య సంఘం, దళిత బహుజన ఫ్రంట్ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. యాత్రలో నేరుగా పాల్గొంటామని వెల్లడించాయి. టీడీపీ తరఫున ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి హాజరై మద్దతు ప్రకటిస్తారు. కాంగ్రెస్ తరఫున కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి భారీ కాన్వాయ్‌తో వచ్చి యాత్రకు సంఘీభావం ప్రకటిస్తారని పీసీసీ నేతలు తెలిపారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మరికొందరు పీఠాధిపతులు యాత్రకు మద్దతిచ్చారని ఐకాస నేతలు చెప్పారు.
పాదయాత్ర నిర్వహించే వారికి భారీ స్వాగత కార్యక్రమాలు నిషేధమని.. ఎక్కడ కూడా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని డీజీపీ సూచించారు. రూట్ మ్యాప్‌ను అనుమతి లేకుండా మార్చకూడదని.. ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎలాంటి హింసాత్మక, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా.. శాంతియుతంగా పాదయాత్ర చేపట్టాలన్నారు. పాదయాత్ర కొనసాగే ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. మహా పాదయాత్ర వీడియోను చిత్రీకరించాలని.. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP High Court, AP News, Tirumala