AP CABINET MINISTERS HEAVY COMPETITION FOR CABINET BERTHS IN NORTH ANDHRA FROM YCP NK
AP Cabinet : ఉత్తరాంధ్రలో వైసీపీ తరపున మంత్రులు వీళ్లేనా..?
పుష్ప శ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ
AP Cabinet Ministers : ఏపీలో త్వరలో ఏర్పాటయ్యే జగన్ ప్రభుత్వంలో ఈసారి ఉత్తరాంధ్రకు చెందిన మంత్రుల విషయంలో కొంత క్లారిటీ కనిపిస్తోంది. ఇదివరకు వైఎస్ హయాంలో మంత్రులుగా చేసిన వారంతా... ఈసారి వైసీపీలో గెలిచారు. జగన్‌కు రాజకీయంగా సీనియర్ల అవసరం ఉండటం వారికి కలిసి రాబోతోంది.
Andhra Pradesh : ఈసారి ఏపీ కేబినెట్లో ఉత్తరాంధ్రకు మంచి ప్రాతినిధ్యం లభించేలా ఉంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోని 34 సీట్లలో వైసీపీ 28 గెలిచింది. విజేతల్లో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంతో పాటు కొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వారిలో బొత్స, ధర్మానకు మంత్రి పదవులు ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకు వైఎస్ హయాంలో ధర్మాన రెవెన్యూ మంత్రిగా చేశారు. బొత్స భారీ పరిశ్రమలు, రోడ్లు భవనాలు, మార్కెటింగ్ వంటి మంత్రిత్వ శాఖల్ని నిర్వహించారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో పనిచేసిన ధర్మాన... 2014 ఎన్నికల నాటికే వైసీపీలో చేరగా.. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ 2014 ఎన్నికల్లో ఓడిన బొత్స సత్యనారాయణ... మూడేళ్ల కిందట ఫ్యాన్ గూటికి చేరారు.
ఈసారి ఎన్నికల్లో బొత్స చాతుర్యంతో విజయనగరం జిల్లాలో వైసీపీ... టీడీపీని తుడిచిపెట్టేసి క్లీన్ స్వీప్ రికార్డు సాధించింది. శ్రీకాకుళం జిల్లాలోనూ ధర్మాన కుటుంబం హవాతో టీడీపీ కేవలం 2 స్ధానాలకే పరిమితమైంది. ఈ 2 జిల్లాల్లో వైసీపీ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ధర్మాన, బొత్సలకు కేబినెట్ బెర్తులు ఖాయమని తెలుస్తోంది.
పుష్ప శ్రీవాణి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి గెలిచిన మాజీ మంత్రి, సీనియర్ నేత తమ్మినేని సీతారాంను కూడా మంత్రి పదవి లేదా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు జగన్ పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం ధర్మానకే అవకాశం దక్కనుంది. అప్పుడు తమ్మినేని సీతారాంకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేదా ఛీఫ్ విప్ పదవుల్లో ఒకటి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కురుపాం నుంచి వరుసగా రెండోసారి గెలిచిన పాముల పుష్ప శ్రీవాణిని కూడా ఎస్టీ, మహిళా కోటాలో మంత్రి పదవి వరించే అవకాశముంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లా కోడలు. మహిళా కోటాలో రోజా తర్వాత ప్రస్తుతం వైసీపీలో మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న వారిలో పుష్పశ్రీవాణి ముందున్నారు.
ఇక విశాఖ జిల్లాలోనూ వైసీపీ ఈసారి మంచి విజయాలు సాధించింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమర్ నాథ్‌తో పాటూ, భీమిలీ నుంచి గెలిచిన సీనియర్ నేత, మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి రేసులో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి విశాఖ జిల్లాలో పార్టీని ముందుండి నడిపించిన గుడివాడ అమర్నాథ్... ప్రత్యేక రైల్వేజోన్ కోసం పాదయాత్రతో పాటు ఎన్నో ఉద్యమాలు చేశారు. దీంతో అమర్నాథ్పై జిల్లాలో సానుకూలత వ్యక్తమవుతోంది.
గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు నుంచీ టీడీపీ తరఫున గెలిచి మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్‌కు కూడా మంత్రి పదవి అవకాశాలున్నాయి. పార్టీ మార్పు మినహా మిగతా అంశాలు అవంతికి కలిసి రానున్నాయి. జిల్లాకు ఒకే పదవి, విధేయత వంటి అంశాలు లెక్కలోకి తీసుకుంటే మాత్రం అమర్నాథ్కు అవకాశముంది.
(సయ్యద్ అహ్మద్, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18)
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.