AP BJP LEADERS GVL NARASIMHA RAO VS SUJANA CHOWDARY BIG FIGHT ON CAPITAL ISSUE SB
ఏపీ బీజేపీలో మూడు ముక్కలాట... టీడీపీకి అనుకూల, వ్యతిరేక వాదనలు
జీవీఎల్, చంద్రబాబు, సుజనా చౌదరి
అప్పట్లో రాజధాని ఎంపికపై చంద్రబాబు కానీ ఇప్పుడు సీఎం జగన్ కానీ తమను సంప్రదించలేదని, ఎందుకంటే అది రాష్ట్ర పరిధిలోని అంశమని వారు వాదిస్తున్నారు. అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బీజేపీ ఎంపీలు మాత్రం చంద్రబాబు వాదనను తలకెత్తుకుంటున్నారు.
2024 నాటికి ఏపీలో కీలక రాజకీయ శక్తిగా ఎదగాలన్న బీజేపీ అధిష్టానం ఆలోచనలకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు గండికొడుతున్నారు. కీలక అంశాలపై పార్టీ తరఫున తమ విధానాన్ని వినిపించాల్సిన నేతలు, సొంత అజెండాలతో చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తమదైన విమర్శలతో రెచ్చిపోతున్నారు. వీటికి చెక్ పెట్టేందుకే అన్నట్లుగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
ఏపీ బీజేపీలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. నేతలు ఎవరికి వారు టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోతున్నారు. గతంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఎవరికి వారు తమదైన వాదనలు వినిపించగా.. ఇప్పుడు రాజధాని విషయంలోనూ అదే జరుగుతోంది.
కేంద్రం అనుమతి లేకుండా రాజధాని అడుగు కూడా కదల్చడం సాధ్యం కాదంటూ, ఈ విషయాన్ని కేంద్రంతో సంప్రదించాకే చెబుతున్నానంటూ టీజీపీ నుంచి బీజేపీలో చేపిన ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించిన 48 గంటల్లోపే అదే పార్టీకి చెందిన ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు దీనికి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్ణయంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మాత్రం అవసరమైన సాయం అందిస్తామన్నారు. అంతటితో ఆగకుండా జాతీయ అధికార ప్రతినిధిగా తాను చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ వైఖరి అని జీవీఎల్ కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్యలు రాజధానిపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మొన్న మౌనదీక్ష చేసిన పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఎంపీ సుజనా చౌదరికి గట్టి కౌంటర్ గానే ఉన్నాయి.
జీవీఎల్ వ్యాఖ్యలతో ఏపీ రాజధాని వ్యవహారంలో బీజేపీ వైఖరి ఏమిటన్నది రాష్ట్ర స్ధాయి నేతలకు కూడా అవగాహన లేదా అన్న అంశం చర్చకు వస్తోంది. రాష్ట్రాల రాజధానుల ఎంపిక వ్యవహారం ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయమే అన్నది ఇప్పటి వరకూ ఉన్న వాదన. గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఎంపిక చేసిన అమరావతి ఇప్పటివరకూ రాజధానిగా కొనసాగింది. ఇందులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిందేమీ లేదు. అలాగే అప్పట్లో రాజధానిగా అమరావతి ఎంపికపై కేంద్రాన్ని సీఎంగా ఉన్న చంద్రబాబు సైతం సంప్రదించలేదని బీజేపీ నేతలు జీవీఎల్ ప్రకటన తర్వాత ఇప్పుడు చెబుతున్నారు. అప్పట్లో రాజధాని ఎంపికపై చంద్రబాబు కానీ ఇప్పుడు సీఎం జగన్ కానీ తమను సంప్రదించలేదని, ఎందుకంటే అది రాష్ట్ర పరిధిలోని అంశమని వారు వాదిస్తున్నారు.
అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన బీజేపీ ఎంపీలు మాత్రం చంద్రబాబు వాదనను తలకెత్తుకుంటున్నారు. రాజధానిని మార్చే అధికారం జగన్ కు ఎవరిచ్చారనే చంద్రబాబు ప్రశ్నకు కొనసాగింపుగా కేంద్రం అనుమతి లేకుండా రాజధాని అంగుళం కూడా మారదని సుజనా చౌదరి చెప్పినట్లు అర్ధమవుతోంది. అయితే ఈ వాదనలన్నీ తప్పేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో జీవీఎల్ స్పష్టం చేయడంతో ఇప్పుడు ఈ అంశంపై సుజనా, కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.