AP BJP CHIEF SOMU VEERRAJU SUPPORTS YS JAGAN GOVERNMENT NEW DISTRICTS FORMATION DECISION AK
AP Politics: జగన్ సర్కార్ నిర్ణయానికి జై కొట్టిన ఏపీ బీజేపీ.. మాది అదే ఆలోచన అంటూ..
సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన తరువాతే.. దీనిపై టీడీపీ ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతుందన్నది తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పరిపాలనపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీలో వైఎస్ జగన్ సర్కార్.. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు కోసం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొత్త జిల్లాలకు సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా ఖరారు చేసుకున్న ప్రభుత్వం.. ఆ దిశగానే ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వానికి విపక్షాల నుంచి ఎలాంటి సవాళ్లు, సమస్యలు ఎదురవుతాయో అని అంతా ఎదురుచూస్తున్న వేళ.. ఏపీ బీజేపీ ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఊరట కలిగించే విషయం చెప్పింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లా ఏర్పాటు నిర్ణయానికి తాము అనుకూలమనేలా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసమని బీజేపీ గతంలోనే చెప్పిందని ఆయన అన్నారు.
బిజెపి 2014లోనే ఎన్నికల ప్రణాళికలో ఈ అంశాన్ని పొందుపరిచిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రణాళికను నేటికీ ఈ ప్రభుత్వం అమలుపరచడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పరిపాలన పట్ల బిజెపి పార్టీకి ఉన్న దూరదృష్టిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ లాగా అభివృద్ధిని కూడా విస్తరింపచేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు అన్నారు. స్థానికుల నుంచి వస్తున్న అభిప్రాయాలు తీసుకుని ఆయా జిల్లాలకు పేర్లు పెట్టాలన్నది బీజేపీ డిమాండ్ అని వ్యాఖ్యానించారు. ఏపీలోని పలు అంశాలపై వైసీపీతో ఢీ అంటే ఢీ అంటూ టీడీపీ తరహాలోనే విపక్షంగా వ్యవహరిస్తోంది బీజేపీ.
ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల విషయంలో ఆ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుందో అని అంతా భావించారు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తాము సానుకూలమే అన్నట్టు ఏపీ బీజేపీ ముఖ్యనేత వ్యాఖ్యానించడంతో.. ఇక దీనిపై టీడీపీ, జనసేన ఏ విధమైన వైఖరిని ప్రదర్శిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు, స్థానికంగా వచ్చే డిమాండ్లను బట్టి ముందుకు సాగేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చిన తరువాతే.. దీనిపై టీడీపీ ఏ విధమైన వైఖరితో ముందుకు సాగుతుందన్నది తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో వేగంగా ముందడుగు వేయాలనే ఆలోచనతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని.. అన్నీ కుదిరితే ఉగాది నుంచే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోవాలన్నది ఆయన ఆలోచన అని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏపీలోని అనేక అంశాల్లో జగన్ సర్కార్‌ని టార్గెట్ చేస్తున్న బీజేపీ.. కొత్త జిల్లాల విషయంలో మాత్రం ఆ పార్టీ నిర్ణయానికి జై కొట్టడం అధికార పార్టీకి జై కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.