ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీజేపీ అద్యక్షుడు సోము వీర్రాజు (AP BJP Chief Somu Veerraju) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సోము ప్రకటించారు. తనకు పదవులంటే ఆశలేదని.. 42 ఏళ్లుగా ఈ వ్యవస్థలో ఉన్నానని తెలిపారు. 2024లో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్న ఆయన.. తమ పార్టీకి పాలించే సత్తా ఉందన్నారు. ఈసారి బీజేపీకి అధికారం ఇవ్వాలన్నారు సోము వీర్రాజు. తనకేం సీఎం అవ్వాలన్న కోరిక లేదన్నారు. గతంలో పదవులు పొందే అవకాశం వచ్చినా తాను తిరస్కరించానని గుర్తు చేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బీజేపీలో చేరుతున్నారంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్ కు సోము కౌంటర్ ఇచ్చారు. రఘురామపై అవినీతి కేసులున్నాయని ఆరోపిస్తున్న వైసీపీ.. 2019లో ఆయనకు ఎంపీ సీటు ఎందుకిచ్చారని నిలదీశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇక చంద్రబాబు స్టేట్ మెంట్ ను షెకావత్ లోక్ సభలో చవివి వినిపించారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను సోము వీర్రాజు ఖండించారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్.. లోక్ సభలో వైసీపీ వైఫల్యాలను కడిగేశారని.. ఎవరో రాసిస్తే చదివే కనీసం జ్ఞానం లేని మంత్రులు తమ వారు కాదన్నారు. అదే కేంద్ర మంత్రి ఏపీకి వస్తే వైసీపీ మంత్రులు, కార్యకర్తలే తిరుపతి ప్రసాదాలు ఇస్తున్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు. అన్నమయ్య డ్యామ్ కట్టతెగిన వెంటనే ఎందుకు కమిషన్ వేయలేదని ఆయన నిలదీశారు. సమగ్రమైన అభివృద్ధే బీజేపీ అజెండా అని అందుకే అధికారం ఇవ్వాలని ఆంధ్రా ప్రజలను కోరుతున్నట్లు సోము వీర్రాజు అన్నారు. తాము 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా ఎక్కడా అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తున్నామన్నారు.
అంగన్ వాడీలకు గుడ్లు కూడా అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఓ జిల్లా ఎస్పీకి ఎర్రచందనం మాఫియా నుంచి నెలకు రూ.5కోట్లు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారుజగన్ ప్రభుత్వం.. అవినీతికి పాల్పడున్నవారి దగ్గర నుంచి లంచాలు తీసుకొని వదిలేస్తోందని ఆరోపించారు. ఇలా వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Somu veerraju