ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతే ఉండాలని, ఇందులో రెండో అంశానికి చోటులేదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ది అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం కూడా విజయవాడలోనే నిర్మిస్తున్నట్టు తెలిపారు. సోమవారం తుళ్లూరులో భారతీయ కిసాన్ సంఘ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని అన్నారు. తాము అధికారంలో వస్తే అమరావతి రైతులకుకు ఇచ్చిన ఫ్లాట్లను రూ. 2వేల కోట్లతో అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలో ఉంటాయని అన్నారు. రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలు నేరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అంశం గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోగా, ప్రతిపక్ష టీడీపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఏడాది కాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు వ్యుహాలు రచిస్తోంది. అయితే ఈ అంశంపై కేంద్రంలో అధికారంలో బీజేపీ పెద్దలు మాత్రం స్పష్టమైన వైఖరి తెలుపడం లేదు. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు ఎవరికి తోచిన రీతిలో వారు రాజధాని అంశంపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక, ప్రధాని మాటగా చెబుతున్నానని సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్‌పై అధికార వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది.
మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఏడాది కాలంగా నిరసన చేపట్టిన ఆ ప్రాంతవాసులకు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కాసింత ఊరట కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Published by:Sumanth Kanukula
First published:December 14, 2020, 15:46 IST