Home /News /politics /

AP BJP CHIEF KANNA LAKSHMI NARAYANA ARREST CREATE TENSION IN PALNADU AK

పల్నాడులో మళ్లీ టెన్షన్... ఏపీ బీజేపీ చీఫ్ కన్నా అరెస్ట్

కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్

కన్నా లక్ష్మీనారాయణ హౌస్ అరెస్ట్

గురజాలలో బహిరంగ సభకు అనుమతి లేదంటూ పోలీసులు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు.

    గురజాలలో బీజేపీ తలపెట్టిన సభకు వెళుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మాచర్ల, గురజాలలో బీజేపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గురజాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇందుకు అనుమతి లేదన్న పోలీసులు... గుంటూరుకు వచ్చి కన్నాకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కన్నా వాటిని తీసుకోవడానికి నిరాకరించి గురజాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

    దీంతో సత్తెనపల్లి పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. సత్తెనపల్లి గెస్ట్ హౌస్‌కు తరలించారు. కన్నాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు... పెద్ద ఎత్తున సత్తెనపల్లి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఇక గురజాలలో తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై కన్నా ఏపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మూడు నెలల్లో వైసీపీ ఇన్ని తప్పులు చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుందో అర్థం అవుతుందని ఆయన ఆరోపించారు.

    బీజేపీ నేతలపై వేధింపులపై అనేక సార్లు పోలీసులతో మాట్లాడానని... కానీ వారు చేతులెత్తేశారని వ్యాఖ్యానించారు. డిజిపిని కలిసి విజ్ఞప్తి చేసినా పలితంలేదని అన్నారు. కనీసం ప్రజాస్వామ్యయుతంగా సమావేశం పెట్టే స్వేచ్ఛ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయ భూములు పంచిపెట్టే యత్నాలు మానుకోవాలని సీఎం జగన్‌కు సూచించారు. దాతలు ఇచ్చిన భూములు సొంత ఆస్తుల మాదిరిగా పంచుతామంటే ఎలా అని ప్రశ్నించారు. దీన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Bjp, Kanna laxminarayana, Palnadu

    తదుపరి వార్తలు