AP ASSEMBLY SPEAKER TAMMINENI SITARAM VS CHANDRABABU IN ASSEMBLY SK
AP Assembly: స్పీకర్‌కు వేలెత్తిచూపిన చంద్రబాబు.. సభలో రచ్చ.. రచ్చ..
తమ్మినేని సీతారాం, చంద్రబాబు నాయుడు
AP Assembly sessions: స్పీకర్, చంద్రబాబు వాగ్వాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేపర్లు విసిరేసి, స్పీకర్ వైపు వేలెత్తి చూపిస్తారా? అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఒక ప్రొసీజర్ ప్రకారం సభ ముందుకు వెళ్తుందని.. మధ్యలో ఎప్పుడు అడిగితే.. అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలా? అని విమర్శించారు
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా రచ్చ జరిగింది. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. టిడ్కోపై చర్చ సందర్భంగా వీరి గొడవ తారా స్థాయికి చేరింది. స్పీకర్ తమ్మినేని సీతారం వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేలెత్తి చూపించడంపై దుమారం రేగుతోంది. మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ని చంద్రబాబు కోరారు. ఐతే తనకు ఎందుకు అవకాశం ఇవ్వరని.. వేలెత్తి చూపించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఏం వేలెత్తి వార్నింగ్ ఇస్తావా? నీ పిల్లి శాపనార్థాలకు భయపడను. పోడియంలోకి వచ్చి బెదిరిస్తావా? ఏమనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు?'' అంటూ.. తన చేతిలో ఉన్న పేపర్లను విసిరేసారు స్పీకర్. చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా సీటులో నుంచి లేచి నిలబడి.. స్పీకర్‌పై విమర్శలు గుప్పించారు. కాగితాలు విసిరేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు.
స్పీకర్, చంద్రబాబు వాగ్వాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేపర్లు విసిరేసి, స్పీకర్ వైపు వేలెత్తి చూపిస్తారా? అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఒక ప్రొసీజర్ ప్రకారం సభ ముందుకు వెళ్తుందని.. మధ్యలో ఎప్పుడు అడిగితే.. అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలా? అని విమర్శించారు. సభలో పద్దతిగా వ్యవహరించాలని చురకలంటించారు. స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇలానేనా వ్యవహరించేది అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.