AP ASSEMBLY SESSION SPEAKER TAMMINENI SITARAM SUSPENDS TDP MLAS SK
AP Assembly: అదే సీన్.. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
ఏపీ అసెంబ్లీ (ఫైల్ ఫోటో)
రెండో రోజు కూడా టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. 12 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ శీతకాల సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సభలో వరుసగా రెండో రోజు కూడా గందరగోళం నెలకొంది. చర్చ తక్కువ.. రచ్చ ఎక్కువగా జరుగుతోంది. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో రెండో రోజు కూడా టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. 12 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. చంద్రబాబు మినహా ఇతర ఎమ్మెల్యేలందరూ సభ నుంచి వెళ్లిపోయారు. సభ కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నందున..వారిని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, చిన్నరాజప్ప, జోగేశ్వరరావు, బీవీడీస్వామి, గొట్టిపాటి రవికుమార్, వెలగపూడి రామకృష్ణ, ఏలూరి సాంబశివరావు, రామరాజు, గణబాబు, బి.అశోక్, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్ ఉన్నారు.
అంతకుముందు టిడ్కోపై చర్చ సందర్భంగా చంద్రబాబు, స్పీకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని.. వేలెత్తి చూపించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. మీ బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ''ఏం వేలెత్తి వార్నింగ్ ఇస్తావా? నీ పిల్లి శాపనార్థాలకు భయపడను. పోడియంలోకి వచ్చి బెదిరిస్తావా? ఏమనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు?'' అంటూ.. తన చేతిలో ఉన్న పేపర్లను విసిరేసారు స్పీకర్. చంద్రబాబు, అచ్చెన్నాయుడు కూడా సీటులో నుంచి లేచి నిలబడి.. స్పీకర్‌పై విమర్శలు గుప్పించారు. కాగితాలు విసిరేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు.
స్పీకర్, చంద్రబాబు వాగ్వాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పేపర్లు విసిరేసి, స్పీకర్ వైపు వేలెత్తి చూపిస్తారా? అని చంద్రబాబుపై మండిపడ్డారు. ఒక ప్రొసీజర్ ప్రకారం సభ ముందుకు వెళ్తుందని.. మధ్యలో ఎప్పుడు అడిగితే.. అప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలా? అని విమర్శించారు. సభలో పద్దతిగా వ్యవహరించాలని చురకలంటించారు. స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇలానేనా వ్యవహరించేది అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఐతే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.