సెలక్ట్ కమిటీ విషయంలో టీడీపీకి రెండో ఎదురుదెబ్బ...

రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ శాసనమండలి కార్యదర్శి ఆ ఫైల్‌ను రెండోసారి వెనక్కి పంపారు.

news18-telugu
Updated: February 14, 2020, 7:55 PM IST
సెలక్ట్ కమిటీ విషయంలో టీడీపీకి రెండో ఎదురుదెబ్బ...
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్
  • Share this:
రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ శాసనమండలి కార్యదర్శి ఆ ఫైల్‌ను మరోసారి వెనక్కి పంపారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే ఫైల్‌ను వెనక్కి పంపారు. అయితే, చైర్మన్ షరీఫ్ మరోసారి ఆ ఫైల్‌ను కార్యదర్శికి పంపి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ, రెండోసారి కూడా ఫైల్‌ను వెనక్కి పంపారు శాసనమండలి కార్యదర్శి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని - అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును ఆమోదించిన తర్వాత దాన్ని శాసనమండలికి పంపింది. అయితే, ఆ తర్వాత శాసనమండలిలో ఆ బిల్లుపై భారీ వివాదం చెలరేగింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై వివాదం నెలకొంది. నిబంధనలకు అనుగుణంగా లేదంటూ ఆ సెలక్ట్ కమిటీ ఏర్పాటును శాసనమండలి సెక్రటరీ తిప్పి పంపారు. దీనిపై రెండు పార్టీల మధ్య వాదన ప్రతివాదనలు జరుగుతున్నాయి. సెలక్ట్ కమిటీ ఏర్పాటు కాలేదు కాబట్టి, నిబంధనల ప్రకారం 14 రోజులు దాటితే ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగానే పరిగణించాలని వైసీపీ చెబుతోంది.

మరోవైపు వైసీపీ వాదనను టీడీపీ ఖండిస్తోంది. సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారంటే, దాన్ని తిప్పి పంపే అధికారం కోర్టులకు కూడా ఉండదని, అధికారులకు ఎలా ఉంటుందని టీడీపీ ప్రశ్నిస్తోంది. శాసనమండలి కార్యదర్శి... చైర్మన్ చెప్పినట్టు చేయాల్సిందే కానీ, ఆయన నిర్ణయాలను తిప్పి పంపే అధికారం లేదని స్పష్టం చేసింది.

ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు