స్కూల్ ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ ఏపీలో కొత్త చట్టం.. తల్లిదండ్రులకు లాభాలివే..

AP Education bill | విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2009లో తీసకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది.

news18-telugu
Updated: July 29, 2019, 8:52 PM IST
స్కూల్ ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ ఏపీలో కొత్త చట్టం.. తల్లిదండ్రులకు లాభాలివే..
పిల్లలతో అక్షరాలు దిద్దిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
ఏపీలో విద్యార్ధుల తల్లితండ్రుల నడ్డి విరుస్తున్న ప్రైవేటు స్కూళ్ల ఫీజులకు అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను శాసనసభ ఇవాళ (జూలై 29న) ఆమోదించింది. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు భారీ ఫీజుల నుంచి తల్లితండ్రులకు విముక్తి కలిగించడం ద్వారా విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు. విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 2009లో తీసకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా విద్యను లాభాపేక్షతో సంబంధం లేకుండా ప్రతీ చిన్నారికీ అందించేందుకు వీలుగా రెండు కీలక బిల్లులను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఇందులో ఒకటి స్కూళ్లకూ, రెండవది కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్ధలకూ వర్తింపజేయనుంది. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీకి చెక్ పెట్టేలా రెండు కమిషన్లను ప్రభుత్వం నియమించబోతోంది. ఇందులో హైకోర్టు రిటైర్డ్ జడ్డిగా ఉండే ఛైర్మన్ తో పాటు జాతీయ స్ధాయిలో విద్యానిపుణులు, విద్యావేత్తలు, మేథావులు, ఇతర వర్గాల నుంచి 11 మంది సభ్యులు ఉంటారు. ఈ రెండు కమిషన్లకు ఛైర్మన్లుగా ఉండే రిటైర్డ్ హైకోర్టు జడ్జిలను సిట్టింగ్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ నియమిస్తారు.

ఈ కమిషన్ కు విద్యావ్యవస్ధ పర్యవేక్షణలో భాగంగా సర్వాధికారాలు కట్టబెట్టారు. కమిషన్ సభ్యులు రాష్ట్రంలో ఏదైనా స్కూలు లేదా కళాశాలకు వెళ్లి అక్కడ అడ్మిషన్, బోధనా విధానాన్ని సైతం పర్యవేక్షించగలుగుతారు. స్కూళ్ల గ్రేడింగ్ ను, విద్యాహక్కు చట్టం అమలును, అక్రిడేషన్ ను సైతం కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు నిర్ణయించిన వాటి కంటే ఎక్కువగా ఉంటే వాటిపై యాజమాన్యాలను హెచ్చరించడమే కాదు, జరిమానాలు విధించడం, చివరకు వాటిని మూయించే అధికారం కూడా కమిషన్ కు అప్పగించారు. విద్యాసంస్ధల్లో ఫీజులు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాలను కూడా కమిషన్లు పర్యవేక్షిస్తాయి. పేద, మధ్యతరగతి వారికి విద్యను అందుబాటులోకి తీసుకురావడంతో భాగంగా కమిషన్లు స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకుంటాయి.

ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ బిల్లు చరిత్రాత్మకం. గత ప్రభుత్వంలో చట్టాలను చేసే మంత్రులే.. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కారు.. భావితరాలకు ఆస్తిగా ఇవ్వగలిగేది ఒక్క చదువు మాత్రమే. పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఇకపై రాష్ట్రంలోని ప్రతీ విద్యాసంస్ధలో 25 శాతం సీట్లను పేద విద్యార్ధులకు కేటాయించాల్సి ఉంటుంది. పేద విద్యార్ధులు అందుబాటులో లేని పక్షంలో మాత్రమే ఇతర విద్యార్ధులకు వాటిలో చోటు కల్పిస్తారు. ప్రస్తుతం ఏపీలో నిరక్షరాస్యత శాతం 33గా ఉంది. దీన్ని సున్నాకు తీసుకొచ్చేందుకు వీలుగా ప్రతీ చిన్నారిని బడికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని బిల్లులో నిర్దేశించారు.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు